నేటి నుంచి ఇప్పిలి 102వ జయంతి వేడుకలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ వంశపారంపర్య అర్చక ప్రధానులు దివంగత ఇప్పిలి జోగారావు 102వ జయంతి వేడుకలు ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో జరగనున్నాయి. రెండేళ్ల క్రితం జోగారావు గారి శతజయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఇప్పిలి కుటుంబసభ్యులు.. కుమారుడు సూర్యదేవాలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలోని శ్రీసుమిత్ర కళాసమితి, ఆరామ ద్రావిడ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
● 26న సాయంత్రం 5.30 గంటలకు కేరళకు చెందిన విష్ణుదేవ్ నంబూద్రిచే సుస్వర గానామృతం, 27న కేరళ సోదరులుగా పేరొందిన ఆర్.కన్నన్, ఆర్.ఆనంద్‌లచే నాదస్వర విన్యాసం, 28న వీణావిద్వాంసులు ఫణి నారాయణచే తంత్రీనాద వినోదం, 29న చైన్నె కళాకారిణి సుచిత్ర బాలసుబ్రమణియంచే సుచిత్రా గాత్ర సౌరభం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటల కార్యక్రమాలు మొదలవుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
8 నెలల గర్భిణి మృతి
కంచిలి: ఎనిమిది నెలల గర్భిణి మృతిచెందిన ఘటన కంచిలి మండలం అర్జునాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి(26) ప్రసవం కోసం కంచిలి మండలం అర్జునాపురంలోని కన్నవారింటికి వచ్చింది. సోమవారం రాత్రి పురిటి నొప్పులు తాళలేక మృతిచెందింది. ఫిట్స్ రావడం వల్లే మృతిచెందినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ధనలక్ష్మికి ఇచ్ఛాపురం మండపల్లి గ్రామానికి చెందిన కాయ శివతో ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది. ఇంతలోనే మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అధికారుల తీరు సరికాదు
నరసన్నపేట : బొరిగివలసకు మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ వచ్చినా ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై సర్పంచ్ బగ్గు విష్ణమ్మ, ఎంపీటీసీ జగదీశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ వస్తారనే సమాచారం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా, అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీని అవమానించినట్లుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ముమ్మరంగా వస్తున్నా.. ధాన్యం రావడం లేదని, అందుకే కొనుగోళ్లు ప్రారంభించలేదని జేసీకి సచివాలయ సిబ్బంది చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణంపోయింది
● అబుదాబిలో దొంకూరు యువకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: తీర ప్రాంతానికి చెందిన మత్స్యకార యువకుడు అబుదాబిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు(22) ఏడాదిన్నర క్రితం జీవనోపాధి కోసం వెల్డింగ్ హెల్పర్‌గా వెళ్లాడు. అక్కడే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భాస్కరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ మంగళవారం సాయంత్రం ఫోన్‌లో సమాచారం అందివ్వడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి రామ్మూర్తి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ విలపిస్తోంది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసినప్పటికీ కారణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కుటుంబ సభ్యులు స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆలయంలో చోరీ
పలాస: తర్లాకోట గ్రామంలోని కాటమ్మతల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయం తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీలో కానుకలు పట్టుకుపోయారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ఇప్పిలి 102వ జయంతి వేడుకలు
నేటి నుంచి ఇప్పిలి 102వ జయంతి వేడుకలు
నేటి నుంచి ఇప్పిలి 102వ జయంతి వేడుకలు


