మాక్ అసెంబ్లీ ఎంపికల్లో రాజకీయ జోక్యం!
● జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అన్యాయం
● రాజకీయనేతల సిఫార్సులకు
తలొగ్గారంటూ విమర్శలు
శ్రీకాకుళం : విద్యార్థుల్లో రాజ్యాంగం, హక్కులపై అవగాహన పెంచేందుకు, రాజకీయాలపై ఆసక్తి కలిగించేందుకు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేయాలని, ఇందుకుగాను కొన్ని పోటీలను నిర్వహించాలని సూచించింది. జిల్లా స్థాయిలో ఈ మేరకు పోటీలను నిర్వహించి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి కొద్ది రోజుల క్రితం నివేదించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలుగా పేర్కొంటూ జాబితాలను రాష్ట్రస్థాయికి పంపించారు. ఇందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయిలో ఎంపిక చేస్తారని అందరూ భావించగా, ఉపాధ్యాయులు విద్యార్థులు సైతం ఇదే నమ్మకంతో ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన జాబితాని చూసి అంతా అవాక్కయ్యారు. నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపించింది. ఇందులో ప్రథమ స్థానం సాధించిన వారికి కాకుండా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న వారిని ఎంపిక చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కొందరు దృష్టిసారించి వాకబు చేయగా రాజకీయ నేతలు జోక్యంతో ఇలా జరిగిందని తెలుసుకొని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రతిభ గల వారిని ఎంపిక చేయకుండా ఈ విధంగా రాజకీయ సిఫార్సులతో ఎంపికలు చేసేటప్పుడు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం దేనికని నిలదీస్తున్నారు. ఇటువంటి పోటీలు ఏమి లేకుండానే తమకు ఇష్టం ఉన్నవారిని ఎంపిక చేసుకొని రాష్ట్రస్థాయిలో జరిగే మాక్ అసెంబ్లీకి తీసుకు వెళ్లవచ్చు కదా అన్న ప్రశ్న పలు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, జాబితాలో ఎంపికై న వారికి త్వరలోనే అమరావతిలో మాక్ అసెంబ్లీని నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ వా రి జిల్లాలోని ప్రాంతాల్లోని సమస్యలపై మాట్లాడా ల్సి ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని కోల్పోయిన ప్రతి భ కలిగిన విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.
మాకు తెలియదు..
జిల్లాస్థాయిలో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి నివేదించాం. రాష్ట్రస్థాయిలో ఏ ప్రాతిపదికన ఎంపికలు జరిగాయో మాకు తెలియదు. ఈ విషయంపై జిల్లాస్థాయిలో మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. – రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి


