ప్రారంభోత్సవానికి రాజకీయ అడ్డంకులు
వర్సిటీలో నిర్మించిన నూతన భవనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నూతన భవనం ప్రారంభోత్సవానికి కూటమి నేతలు రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో (ఏడాదిన్నర క్రితం) భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవం చేయమని వర్సిటీ ఉన్నతాధికారులు కోరినా దాటవేస్తూ వస్తున్నారు. రూ.38 కోట్లతో కట్టిన భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఎట్టకేలకు వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ ప్రోటోకాల్ పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు ఫోన్ చేసి బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని ఆపాలంటూ ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో భవనం ప్రారంభోత్సవంపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు.


