రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలగ ప్రాంతానికి చెందిన ఇంజరాపు రవికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. శ్రీకాకుళం నుంచి సాలూరు గ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు ‘మాయాజాలం’
కవిటి : వచ్చే ఏడాది జనవరి 1, 2, 3, 4వ తేదీలలో వరంగల్‌లో జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన ‘మాయాజాలం’ నాటిక ఎంపికై నట్లు కళాకారులు మంగళవారం తెలిపారు. అప్పాజోస్యుల–విష్ణుభొట్ల–కందాళం ఫౌండేషన్–సహృదయం నాటక కళా పరిషత్ ఆధ్వర్వంలో ఈ పోటీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
మహిళలపై దాడులు అరికడదాం
అరసవల్లి: మహిళలు హింసకు గురికాకుండా కృషి చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద మంగళవారం మహిళలపై హింస నిర్మూలనకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ వారికి గల చట్టాలను అవగాహన కల్పించాలన్నారు. మహిళల హక్కులను వివరించి వాటిని ఉపయోగించుకొని తమకు తామే రక్షణ పొందాలన్నారు. మహిళలకు ఎటువంటి రుసుము లేకుండా న్యాయవాదిని నియమించడం, కేసు పరిష్కరించడంలోనూ న్యాయ సేవాధికార సంస్థ ముందుండి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్‌ఓ కె.అనిత, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ ఐ.విమల, వైద్యాధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


