రాష్ట్ర హ్యాండ్‌బాల్ పోటీల విజేతగా శ్రీకాకుళం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్–19 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఫైనల్స్‌లో బాలుర విభాగంలో కడప జిల్లా, బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. మూడు రోజుల పాటు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా పోటీలు జరిగాయి. చివరిరోజు సెమీ ఫైనల్స్‌లో బాలుర విభాగంలో కడప, చిత్తూరు, వైజాగ్, కర్నూలు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్స్‌కు బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు చేరుకున్నాయి. బాలుర విభాగంలో చిత్తూరు జట్టు గట్టి పోటీ ఇచ్చినా చివరికి కడప జట్టు విజేతగా నిలిచింది. కడప 8 పాయింట్లు, చిత్తూరు 5 పాయింట్లు సాధించాయి. మూడో స్థానానికి వైజాగ్, కర్నూలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా చివరికి వైజాగ్ 11 పాయింట్లతో మూడో స్థానం, కర్నూలు 9 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు తలపడగా రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 6 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు విజేతగా, గుంటూరు జట్టు 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కృష్ణా జట్టు 7 పాయింట్లతో మూడవ స్థానంలో, వైజాగ్ జట్టు 5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతలకు పతకాలు, ట్రోఫీ అందజేశారు.


