గంజాయి అక్రమ రవాణా
హత్య కేసులో పెరోల్‌పై వచ్చి..
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
● 20 కేజీల గంజాయి స్వాదీనం
నరసన్నపేట : ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్‌ను నరసన్నపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మడపాం టోల్‌గేట్ వద్ద ఎస్‌ఐ–2 శేఖరరావు సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న అహ్మద్‌ను అనుమానంతో ప్రశ్నించారు. అతని వద్ద సోదా చేయగా 20.860 కేజీల గంజాయిని గుర్తించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఫోన్ సీజ్ చేశామన్నారు. మైసూర్‌లోని మొహాల్లాకు చెందిన షేక్ రియాజ్ అహ్మద్‌కు వ్యసనాలకు బానిసై నేర చరిత్ర కలిగి ఉన్నాడు. 2010లో దర్వడా జైల్లో ఉండగానే తోటి ఖైదీని హత్య చేశాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తుండగా కుటుంబ సభ్యులు ఇతనికి వివాహం చేయడానికి పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకోగా నవంబర్ 5న బయటకు వచ్చాడు. రానున్న జనవరి 3 వరకూ పెరోల్ గడువు ఉంది. జైల్లో ఉన్నప్పుడు గంజాయి అక్రమ రవాణా చేసే వారితో ఏర్పడిన స్నేహంతో బయటకు రాగానే గంజాయి అక్రమ రవాణాకు దిగాడు. బరంపురం ప్రాంతానికి చెందిన హిమాన్స్ శేఖర్ మాహిజా అనే వ్యక్తి నుంచి గంజాయిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి హుబ్బాలికి చెందిన ముజిమల్ అక్తర్, అక్రమ్ హలాభావి(పుచ్చు)లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా మడపాం టోల్‌గేట్ వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు.


