పైవాడే కరుణించాలి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
పొలాల్లో ఎదిగిన పైరు కోతకు సిద్ధంగా ఉంది. పల్లెల్లో కోసిన చేను నూర్పుకు సిద్ధమైంది. నూర్చిన ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి కీలక దశలో మేఘ సందేశం అన్నదాతలను కలవరపరుస్తోంది. వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. దీంతో పాటు సేన్యార్ తుఫాన్ ప్రభావం కూడా ఉండవచ్చనని హెచ్చరికలు ఉండటంతో కలవరపడుతున్నారు. ఇప్పటికే వాయుగుండం, మోంథా తుఫాన్‌తో కొంత నష్టపోయారు. ఈసారి వర్షాలు ఏం చేస్తాయోనని భయ పడుతున్నారు.
వెన్నులో వణుకు..
ఖరీఫ్ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాల హెచ్చరికలు అన్నదాత వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కొన్నిచోట్ల నూర్పులు పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల కంకులు పొలాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల యుద్ధ ప్రాతిపదికన పోగులేస్తుండగా, కొన్నిచోట్ల టార్పాలిన్లు కప్పి భద్రపరుచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవాలని చాలా రోజులుగా రైతులు కోరుతున్నా నామమాత్రంగానే ప్రారంభించారు. 6లక్షల 50వేల మెట్రిక్ టన్నులు మేర కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1638 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కర్షకుల్లో కలవరం
పంట చేతికి వచ్చినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నూర్పులు పూర్తయిన ధాన్యాన్ని రహదారి పక్కనే పోగేసి టార్పాలిన్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తాత్సారం చేస్తూనే ఉంది. జిల్లాలో 4లక్షల 9వేల 951ఎకరాలు ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇప్పటికే చాలా వరకు కోతలు కోశారు. వీటిలో కొన్ని చోట్ల పనలు మీద ఉండగా, మరికొన్నిచోట్ల కుప్పలు వేసి నూర్పిళ్లు చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల యంత్రాలతో కోసిన వరి పంట ధాన్యాన్ని రహదారుల అంచులపై, పొలాల గట్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చేతికందే సమయంలో పంట ఎక్కడ దెబ్బ తింటుందోనని కర్షకులు కలవరపడుతున్నారు. కోత పూర్తయిన పంట అంతా ప్రస్తుతం ఆరబోసి ఉంచారు. ఎంతవేగంగా కొనుగోలు చేస్తే అంత వేగంగా ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు.
చిత్తశుద్ధి ఉందా..?
జిల్లాలో 406 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని యంత్రాంగం ప్రకటించింది. మోంథా తుఫాన్ సమయానికే కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. తాజాగా కొన్ని కేంద్రాలు తెరిచారు. అవి కూడా సక్రమంగా నడవడం లేదు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు మిల్లులను ట్యాగ్ చేశారు. కానీ, ఆ మిల్లుల నుంచి ఇప్పటివరకు బ్యాంకు గ్యారెంటీలు తీసుకోలేదు. జిల్లాలో 264మిల్లులు ఉండగా, ఇంతవరకు 49 మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాయి. అంటే మిగతావి ప్రస్తుతం కొనుగోలు చేయలేవు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించి రూ.3.67కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉండగా రైతులకు పైసా కూడా ఇవ్వలేదు. 24 గంటలు, 48 గంటల్లో చెల్లింపులు వంటివన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి.
అన్నదాతకు కునుకు కరవు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 50 శాతానికి పైగా కోతలు పూర్తయ్యాయి. వాటిలో 30శాతం వరకు కుప్పలు రూపంలో పూర్తవగా, మరో 20శాతం పనలు రూపంలో పంట పొలాల్లోనే ఉన్నాయి. మరో 50శాతం వరకు పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో వర్షాలు పడతాయని హెచ్చరికలు ఉండటంతో రైతులు భయపడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలులు వీచ్చినా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పంటను కాపాడుకోలేమని భావిస్తున్న రైతులంతా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు వేచి చూడకుండా దళారులకు తక్కువకు విక్రయిస్తున్నారు. 80 కిలోల బస్తాను రూ. 1300కు అమ్ముకుంటున్న దుస్థితి నెలకొంది.
జిల్లాలో వరి సాగైన విస్తీర్ణం 4,09,951 ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా 11,23,187 మెట్రిక్ టన్నులు
స్థానిక ధాన్యం వినియోగం 2,24,637 మెట్రిక్ టన్నులు
మార్కెట్‌కు వచ్చే అవకాశం
ఉన్న ధాన్యం 8,98,550 మెట్రిక్ టన్నులు
మద్దతు ధరకు ప్రభుత్వం
కొనుగోలు చేసే లక్ష్యం 6,50,000 మెట్రిక్ టన్నులు
జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న
వరి కొనుగోలు కేంద్రాల సంఖ్య 406
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని
తరలించేందుకు ట్యాగ్ చేసిన మిల్లులు 264
ఇప్పటివరకు బ్యాంకు గ్యారెంటీలు
సమర్పించిన మిల్లులు 49
ఇప్పటి వరకు కొనుగోలు
చేసిన ధాన్యం 1638 మెట్రిక్ టన్నులు
జనరేట్ చేసిన బిల్లుల మొత్తం రూ. 3.67కోట్లు
రైతులకు చెల్లించిన సొమ్ము సున్నా
వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో
ఆందోళన
పండిన పంటను దాచుకోవడానికి ఆపసోపాలు
నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు
రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకోని
పాలకులు
పైవాడే కరుణించాలి..!
పైవాడే కరుణించాలి..!
పైవాడే కరుణించాలి..!


