రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు
● ‘సాక్షి’ కథనాలపై స్పందించిన
పోలీసు శాఖ
● ఎస్పీ ఆదేశాలతో చర్యలకు
ఉపక్రమించిన యంత్రాంగం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి విదితమే. ఈ కథనాలకు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్‌తో ప్రత్యేకంగా మంగళవారం మాట్లాడారు.
అన్ని విభాగాల సమన్వయంతో..
పోలీస్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్‌అండ్‌బీ, రోడ్డు రవాణా, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, విద్యాశాఖ, 108 సర్వీసెస్, ఐఆర్‌ఏడీ విభాగాల అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రమాదాల విశ్లేషణ, ఎ మర్జెన్సీ, రెస్పాన్స్ సమయం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్పుల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఎస్పీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేయడమే కాకుండా ఆచరణలోనూ చేసి చూపించారు. జిల్లావ్యాప్తంగా నో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను పోలీసులతో తీయించడమే కాక, వేకువజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఫేష్ వాష్ చేయించారు.
ప్రమాదాల నివారణకు చేపట్టనున్న చర్యలివే..
● ప్రధాన చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాల వద్ద ప్రతిరోజూ ఒంటిగంట నుంచి వేకువజాము 5 గంటల వరకు వాహనదారులను ఆపి చల్లని నీటితో ముఖం కడిగించి (ఫేస్‌వాష్) కొంత సమయం సేద తీరాక రవాణాకు అనుమతించడం.
● ‘నో పార్కింగ్’ జోన్లలో వాహనాలు నిలిపితే తక్షణమే హైవే మొబైల్ వాహనాలు అక్కడకు చేరి వాటిని పంపివేయాలి. పార్కింగ్‌కు నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలు పెట్టుకునేందుకు సూచనలివ్వాలి.
● ప్రతి ప్రమాద జోన్, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లలో స్పీడ్–లిమిట్, ప్రమాద హెచ్చరిక బోర్డులు, డ్రైవర్లకు సూచనలు ఉండే పెద్ద బోర్డులు అమర్చుతారు. బహిరంగ ప్రదేశాల్లో వాహనాల మళ్లింపు, కూడళ్లు తెలిపే పోస్ట్‌ల ద్వారా వీక్షకుల దృష్టికి తీసుకువస్తారు.
● తరచూ ప్రమాద ప్రదేశాలను బ్లాక్‌స్పాట్ ప్రాంతాలుగా గుర్తించి డ్రోన్ కెమెరాలు, సర్వేలైన్స్ ఆధారంగా నివారణ చర్యలు చేపట్టడం.
● ట్రాఫిక్–ఇంజినీరింగ్–ఆడిట్ నిర్వహించి ట్రాఫిక్ డివైజర్లు, స్పీడ్‌బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు, డ్రమ్స్, కచ్చితమైన సిగ్నల్స్ అమరిక, అవసరమైతే కొత్త పోటింగ్ లేదా రూట్ రీ అలైన్‌మెంట్ సూచించడం.
● హైరిస్క్ రూట్లలో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రధాన మార్గాలు, ఎన్‌హెచ్–16, బస్‌కాంప్లెక్సు, రైల్వే స్టేషన్ మార్గాలు, పుణ్యక్షేత్రాలు, నగరాల్లోని రద్దీ రోడ్లలో ట్రాఫిక్ నియంత్రణ.
● డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలపై రోజువారీ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి చలానాలు విధించడం.
● హైవేల్లో అతివేగంగా ప్రయాణిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక మొబైల్ పెట్రోల్ టీమ్ నియమించడం, ప్రమాదాలు జరిగే సమయాల్లో రోడ్డు సేఫ్టీ వాహనాలు, సిబ్బంది చేరి సహాయక చర్యలు అందివ్వడం.
సూచనలిస్తున్న పోలీసులు
ఫేస్ వాష్ చేయిస్తున్న దృశ్యం
రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు
రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు
రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు


