నిరసనలు.. నినాదాలు.. నిర్బంధాలు
● థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ర్యాలీ భగ్నం
● అడుగడుగునా మోహరించిన పోలీసులు
● అడవి బిడ్డల వేషధారణలతో బాధితుల నిరసనలు
సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి జంక్షన్ వరకు నిర్వహించ తలపెట్టిన చలో సరుబుజ్జిలి ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా అడ్డుకోవడమేంటని పోరాట కమిటీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. అయినా ర్యాలీకి వారు అంగీకరించకపోవడంతో రహదారిపై నిరసనలు తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో 340 మంది పోలీసులు థర్మల్ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలను చుట్టుముట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి గిరిజన ప్రాంతాలైన అడ్డూరిపేట, వెన్నెలవలస, మసానపుట్టి బొడ్లపాడు, జంగాలస గ్రామాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేసి జనాలు ర్యాలీ కార్యక్రమాలకు హాజరుకాకుండా దిగ్బంధనం చేశారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని చెప్పి విల్లులు, బాణా లు ధరించిన గిరిజనులు నిరసనలు తెలిపారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వపోవడంతో సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పోరాట కమిటీ నాయకులు వినతిపత్రం అందించారు.
నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు
అణచివేతలు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆగిన చరిత్ర ఎక్కడా లేదని థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ కన్వీనర్ వాబ యోగి, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు స్పష్టం చేశారు. చలో సరుబుజ్జిలి ర్యాలీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డగించడంతో నిరసనలు తెలిపి, అనంతరం వెన్నెవలస వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ శక్తుల చేతు ల్లో సుమారు 5వేల ఎకరాల భూములను తాకట్టుపెట్టి సరుబుజ్జిలి, బూర్జ మండలాలను బూడిద చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. కేంద్ర, రాష్ట్రమంత్రులతోపాటు, స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలపై ప్రేమ ఉంటే థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసనలు అడ్డగించడంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని జిల్లా ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి స్పష్టం చేశారు.


