శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరగాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుపై మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో ప్రక్రియ మందకొడిగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జలుమూరులో కనీసం ఒక్క ట్రక్ షీట్, ఎఫ్‌టీఓ (ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్) కూడా జెనరేట్ కాకపోవడంపై ఆయన ఆరా తీశారు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) పరిధిలో ధాన్యం సేకరణ డల్‌గా ఉందని, తక్షణమే పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రెండు రోజుల తర్వాత కూడా పనితీరు మెరుగుపడకపోతే ఆ కొనుగోలు కేంద్రాలన్ని రద్దు చేయడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రజా సానుకూల దృక్పథం విషయంలో ర్యాంకులు మెరుగు పరచుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. ‘అన్న క్యాంటీన్’ల పనితీరులో ప్రస్తుతం 18వ ర్యాంకులో ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ విభాగం 8వ ర్యాంకు నుంచి నంబర్ 1 స్థానానికి చేరుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలులో రాష్ట్రంలో జిల్లా 5వ స్థానంలో ఉన్నప్పటికీ, సరుబుజ్జిలి వంటి ప్రాంతాలు వెనుకబడి ఉండడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలియజేశారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత లేదని, ఎండార్స్‌మెంట్ అప్‌లోడ్ చేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.


