పేలు మందు తాగి ఆత్మహత్య
కక్ష పెంచుకొని హత్య
గార: మనుమరాలి శుభకార్యం తాత చేతుల మీదుగా జరగాలని అమ్మమ్మ పట్టుబట్టగా.. తన దగ్గర డబ్బుల్లేవన్న సమాధానంతో మద్యానికి బానిసయ్యావని, డబ్బులు తగలబెడుతున్నావని భార్య తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వత్సవలస పంచాయతీ పేర్లవానిపేట గ్రామానికి చెందిన కొమర నారాయణస్వామి (62) సీమెన్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి సుమారు పదినెలలైంది. దాచుకున్న డబ్బులతో రోజూ మద్యం తాగడంతో ఇంటి దగ్గర తరచూ గొడవలు జరిగేవి. నారాయణస్వామి పెద్ద కూతురు విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉండగా, మనుమరాలు ఇటీవలే రజస్వల అయ్యింది. విందు భోజనం కోసం అల్లుడు, కూతురు చెప్పారని, తాతగారి తరుపున బంగారం, దుస్తులు పెట్టాలని భార్య సత్యమ్మ చెప్పగా, నా దగ్గర డబ్బుల్లేవని నారాయణస్వామి అన్నారు. దీంతో భార్య తీవ్రంగా మందలించగా మనస్తాపం చెందిన నారాయణస్వామి శనివారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లేందుకు అద్దె కారులో బయలుదేరారు. ఆదివారం జరగాల్సిన విందు భోజనాలకు వెళ్తుండగా నాతవలస బ్రిడ్జి సమీపంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని చెప్పారు. దీంతో ఏమయ్యిందని అడగగా కారు ఎక్కేముందు పేలు మందు తాగేసానని చెప్పాడు. దీంతో అదే కారులో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరిలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భార్య సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ముగ్గురు కుమార్తెలుండగా, అందరికీ పెళ్లిళ్లు జరిగాయి.
● అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
● మాట్లాడడానికి తీసుకెళ్లి హత్య చేసిన వైనం
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడలో గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ లక్ష్మణరావు నౌపడ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి మండలం కొండభీంపురం గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణతో, నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన కొనారి పుష్పలతకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ దంపతుల మధ్య గత మూడు సంవత్సరాలుగా కలహాలు తలెత్తాయి. బాలకృష్ణ వ్యసనాలకు బానిసై భార్య పుష్పలతను అనుమానిస్తూ పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ తరచూ గొడవ పడేవాడు. దీంతో భార్య పుష్పలత గ్రామ పెద్దలను సంప్రదించి భర్తపై ఫిర్యాదు చేయగా, గ్రామ పెద్దలు భర్తను మందలించి సరిగ్గా కాపురం చేసుకోవాలని సూచించారు.
పెద్దలకు ఫిర్యాదు చేయడంతో అందరి ఎదుట తన భార్య అవమానించిందని భావించి అమైపె బాలకృష్ణ కక్ష పెంచుకొని చంపడానికి నిర్ణయించుకున్నాడు. భర్త పెట్టిన బాధలను భరించలేక పుష్పలత తన పిల్లలను తీసుకుని వెళ్లిపోయి కన్నవారి ఇంట్లో ఉంచి, నందిగాం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. భర్తపై మెయింటెనెన్స్ కేసు కూడా భార్య వేసింది. భార్యను చంపడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణకు ఈలోగా ఈనెల 20వ తేదీన భార్య పుష్పలత ఫోన్‌చేసి పిల్లలు గురించి మాట్లాడాలని చెప్పింది. బాలకృష్ణ ఇదే అవకాశంగా భావించి భార్య పుష్పలతను టెక్కలిలో కలుసుకున్నాడు. ఎవరు లేనిచోట మాట్లాడుకుందామని నమ్మించి అతని ద్విచక్ర వాహనంపై భార్య పుష్పలతను ఎక్కించుకొని నౌపడ మూడురోడ్లు జంక్షన్ సమీపంలో ఉన్న ముళ్ల పొదల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడుతున్నట్లు నటించి తనతో తీసుకొచ్చిన వెదురు కర్రతో తల, ముఖంపై బలంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అమె సెల్‌ఫోన్, కర్రను ముళ్లపొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. నౌపడ వీఆర్వో డి.జోగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాసరి బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి ఉన్నారు.
పేలు మందు తాగి ఆత్మహత్య
పేలు మందు తాగి ఆత్మహత్య


