వరించాలంటే సిరి.. జాగ్రత్తలు తప్పనిసరి..!
● జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా వరికోతలు
● యాజమాన్య పద్ధతులు పాటించాలని అధికారుల సూచనలు
ఆమదాలవలస: జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నూర్పులు చేపడుతున్నారు. తుఫాన్ సూచనలు ఉండడంతో ముందుగా ధాన్యాన్ని ఇంటికి తరలించి భద్రపరుచుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విధిగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిదని, కష్టానికి తగిన ఆదాయం రావాలంటే జాగ్రత్తలు తీసుకోక తప్పదని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. వరిసాగుతో పాటు పంటకోత, నూర్పిడిలోనూ మెలకువలు పాటించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ప్రధానంగా రైతులకు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన స్థానం, కేవీకే శాస్త్రవేత్తల వద్ద సలహాలు తీసుకోవాలని వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు సూచిస్తున్నారు.
ఇలా చేయాలి...
వరికంకుల్లో 80 నుంచి 90 శాతం గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పడే పంటను కోయాలి. ఈ దశలో ధాన్యం గింజల్లో 18 నుంచి 24 వరకు తేమశాతం ఉంటుంది. పూర్తిగా ఎండిపోయే వరకు వరిపంట కోయకుండా వదిలేస్తే రెక్కరాల్చడం వల్ల గింజ దిగుబడి తగ్గిపోతుంది. ధాన్యం గింజలపై పగుళ్లు వస్తాయి. పగిలిన ధాన్యాన్ని మిల్లులో ఆడించేటప్పుడు బియ్యం శాతం తగ్గి నూకల శాతం ఎక్కువ ఉంటుంది. వరిపంటను కోసిన తర్వాత తేమ శాతాన్ని తగ్గించడానికి వరి పనలను 4 నుంచి 5 రోజులు పంటభూమిలోనే ఆరనివ్వాలి. కోసిన పరి పనలను కిందకు మీదకు తిరగబెడితే సమానంగా ఎండుతుంది. పనలు కోసిన తర్వాత వర్షం కురిస్తే 5 శాతం ఉప్పును పనలపై జల్లితే ధాన్యం రంగు మారదు. వరిపంట పూతకు వచ్చిన తర్వాత 30 రోజుల్లో కోత దశకు చేరుకుంటుంది. పంట పూర్తిగా పండకుండా కోత కోస్తే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. వరికంకిలోని చివర గింజలు పూర్తిగా తోడుకాకుండా ధాన్యం సన్నగా ఉండి పొట్ట తెలుపు రంగులో ఉంటాయి. దీనివల్ల ధాన్యం దిగుబడి తగ్గి నూక, తవుడు శాతం ఎక్కువగా ఉంటుంది. పండిన వరిపంటను యంత్రం ద్వారా నూర్చడం వలన మట్టిబెడ్డలు, చెత్త, దుమ్ము వంటివి ధాన్యంలో ఉండవు. నూర్పు చేసిన ధాన్యాన్ని ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు ఆరబెట్టకూడదు. తేమ పూర్తిగా తగ్గి మిల్లు ఆడించేటప్పుడు నూకలు ఎక్కువగా వస్తాయి.
పాటించాల్సిన మెలకువలు
● నూర్చిన ధాన్యంలో 14 శాతం కన్నా తక్కువగా తేమ ఉండేలా చూసుకోవాలి. ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటే బూజు పట్టడం, రంగు మారడంతో పాటు కీటకాలు ఆశిస్తాయి.
● ఎక్కువ నిల్వ ఉంచాల్సి వస్తే కీటకాలు ఆశించకుండా పొగబెట్టాలి
● ధాన్యాన్ని పొడి సంచుల్లో వేయడంతో పాటు గోడలు, నేలపై తేమ పీల్చకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.
● ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వచేస్తే రంగు మారుతాయి.
● రైతులు సకాలంలో అమ్మడం లేదా మరపెట్టడం చేయాలి.
● రైతు సేవా కేంద్రాలను సంప్రదించి విక్రయాలకు సంబంధించిన ట్రక్ షీట్ పొంది, సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలి.
ఆరుగాలం కష్టపడి వరిని పండించే రైతుల పంటకోత, కుప్పలు పెట్టడం, నూర్పు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పండిన వరిపంటను సకాలంలో కోయాలి. నూర్పు చేసే ధాన్యంలో 14 శాతం కన్నా తేమ తక్కువ ఉండేలా చూసుకోవాలి . ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి.
– డాక్టర్ జి.చిట్టిబాబు, సీనియర్ శాస్త్రవేత్త, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం
వరించాలంటే సిరి.. జాగ్రత్తలు తప్పనిసరి..!


