కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం
● వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఖరీఫ్ కోతలు జరుగుతున్నా ఇంతవరకు సక్రమంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి ప్రభుత్వం రూ.1,890లు మద్దతు ధర ప్రకటించినా.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు రూ.1,350లకే అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర జిల్లాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందోనని ఆవేదన వ్యక్తం చేశారు. మోంథా తుఫాన్‌కి జిల్లావ్యాప్తంగా ప్రాథమికంగా 4 వేల ఎకరాలకు నష్టం కలిగినట్లు అంచనా వేసి, చివరికి 400 ఎకరాలకు ఫైనల్ చేసి అరకొరగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేయడం దారుణమన్నారు. వంశధార, నారాయణపురం, మడ్డువలస, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసి.. శివారు ఆయకట్టుకి నీరివ్వకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. నేరడి బ్యారేజీ అడ్డంకులపై ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ధర్మాన సోదరులు వెళ్లి దీర్ఘకాల సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గొర్లె అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు పీస శ్రీహరి, రైతు విభాగం గార మండల అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, శ్రీకాకుళం మండల అధ్యక్షుడు రావాడ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్య కళాశాల ఎంబీఏ కోర్సుకు ఎన్‌బీఏ టైర్–1 గుర్తింపు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సుకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) టైర్–1 గుర్తింపు లభించిందని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు విశ్వ విద్యాలయాలతో పాటు ఆదిత్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాణాలు, నాణ్యత, పారదర్శకత కలిగిన మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలకు మాత్రమే లభించే ఈ గుర్తింపు ఆదిత్య కళాశాలకు లభించడంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు కృషి ఉందన్నారు. సొసైటీ చైర్మన్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌బీఏ గుర్తింపు పొందడం అంటే ఆదిత్యలో అందిస్తున్న విద్య జాతీయ ప్రమాణాలకు మించి ఉన్నదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
● ఏఐసీసీ సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఏఐసీసీ సెక్రటరీ సూరత్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తాము శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నామన్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ జెండా మోసేవారే కాక, గత కొంతకాలంగా పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే పలువురు నుంచి దరఖాస్తులు అందాయని, ఈనెల 27వ తేదీ వరకు శ్రీకాకుళంలోనే ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కమిటీ సభ్యులు లెక్కరాజు రామారావు, పాచిపెంట శాంతికుమారి, నాయకులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్, గోవింద మల్లిబాబు, బస్వా షణ్ముఖరావు, ఎం.చక్రవర్తిరెడ్డి, లఖినేన నారాయణ, పూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం


