ఎస్పీ గ్రీవెన్సుకు 52 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం (గ్రీవెన్స్)నకు బాధితుల నుంచి 52 వినతులు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి వినతులను స్వీకరించి సకాలంలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే...
● గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి శివకృష్ణ ప్రసాద్ తన కుమారుడు సృజన్‌ను తీవ్రంగా కొట్టి వేధించి చనిపోయేటట్లు చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డిని వేడుకున్నారు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నిత్యం ఇలాంటి ఘటనలే జరుగుతున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని, తమ బిడ్డకు జరిగినట్లు వేరెవరికీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
● శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు మాజీ వీఆర్వో తన భూమి పాసు పుస్తకాలు తీసుకుని ఇవ్వడం లేదని, అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● కొత్తూరు మండలం సోమరాజుపురం స్టోన్ క్రషర్ కాంట్రాక్టర్ సతీష్, గ్రామస్తులు కొందరు ఎస్పీ మహేశ్వరరెడ్డిని గ్రీవెన్సులో కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని అనుమతులు, గ్రామస్తుల అనుమతితో నడుపుతున్న తమ క్వారీలను ఆపేయాలని, లేదంటే డబ్బులివ్వాలని, తాము హ్యూమన్ రైట్స్ కమిటీలో ఉన్నామని కొత్తూరు ఉప్పరిపేటకు చెందిన జాన్ కటారీ, మరికొందరు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.


