ప్రాధాన్యం లేక
టెక్కలి నియోజకవర్గంలో తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఖరీఫ్‌లో 71,675 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం
రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి
టెక్కలి:
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం రైతుల పుట్టి ముంచుతోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మోంథా తుఫాన్ ప్రభావంతో కొంత మేరకు నష్టం వాటిల్లగా మిగిలిన పంటను యంత్రాల ద్వారా కోత కోసి విక్రయించేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. వారి వద్ద ధాన్యం నిల్వలు ఉన్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, ఏ విధంగా అమ్మకాలు చేయాలి అనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించకపోవడం, మళ్లీ తుఫాన్ హెచ్చరికలు ఉండడంతో అన్నదాతలకు దళారులే దిక్కుగా మారుతున్నారు. కొత్తగా వాట్సాప్ సేవలతో ధాన్యం కొనుగోలు చేస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ఆ సేవలపై కనీస అవగాహన కల్పించడం లేదు.
కంచిలి: మండలంలో పలు గ్రామాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో కుప్పలూడ్చి, ఇళ్ల వద్దకు చేర్చి, ఆరబెట్టడం కూడా పూర్తయ్యింది. ఇంతలో తుఫాను వస్తుందనే వార్తలు రా వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో బొగాబెణి, కుమ్మరిపేట, దాలేశ్వరం తదితర గ్రామాల్లో వరి కోతలు పూర్తవ్వగా, గొల్లకంచిలి గ్రామంలో కొంత భాగం కోతలు పూర్తయ్యాయి. ఈ దశలో వాతావరణ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోతున్నారు. తాము ఇళ్ల వద్దకు చేర్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బొగాబెణి సర్పంచ్ గణప సింహాచలం, చైతులు కుణితి తిరుపతిరావు, తెలుకుల రాజేంద్ర, కుమ్మరి గురునాథ్, తెలుకల దండాసి కోరుతున్నా రు. అధికార యంత్రాంగం వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది.
టెక్కలి మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ధాన్యం కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధాన్యం నిల్వలు ఉన్న రైతులు నేరుగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి.
– ఎం.కృష్ణమూర్తి, ఆర్డీఓ, టెక్కలి
ప్రాధాన్యం లేక
ప్రాధాన్యం లేక


