రైతుల లెక్కల్లో తేడాలెందుకు..?
గార: చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 42 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందించకుండా కొర్రీలు వేసిందని, ఈ విషయం జిల్లాలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియకపోవడం బాధాకరమని, ఆ లెక్కల్లో ఎందుకు తేడా వచ్చిందో ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, గార ఎంపీపీ గొండు రఘురాం కోరా రు. ఆయన శుక్రవారం శ్రీకూర్మం జంక్షన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏడాదికి రూ.20వేలు ఇస్తామ ని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారని గుర్తు చేశారు. జిల్లాలో 3. 21 లక్షల మంది రైతులుండగా, 2.79 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇచ్చి మిగతా వారిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రైతు భరోసా అనే పేరు మార్చడంపై ఉన్న శ్రద్ధ పథకం అమలులో లోపించిందన్నారు. ఎరువుల కొరత, యాంత్రీకరణ లేకపోవడం, విత్తనాలు అందించలేకపోవడం, రైతు భరోసాలు నిర్వీర్యం చేయడం వంటివి చూస్తుంటే రైతు ఎలా బతుకుతాడనే దిగులు కలుగుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే రైతులను ఆదుకున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, గార మండల రైతు విభాగం అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, కొయ్యాన నాగభూషణం, టి.అప్పలరాజు, కాశిన మల్లేసు పాల్గొన్నారు.


