టీడీపీ నేతల బరితెగింపునకు చెక్
రణస్థలం: టీడీపీ నాయకుల బరితెగింపునకు రెవె న్యూ అధికారులు పోలీసుల సమక్షంలో చెక్ పెట్టా రు. లావేరు మండలం కొత్త కుంకాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 55లో పెద్ద కోనేరు చెరువు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు మడ్డువలస కాలువ వల్ల రెండు పాయలుగా చీలిపోయింది. ఒకవైపు రెండు ఎకరాల పరిధిలో ఉన్న చెరువుపై స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. జేసీబీలతో పనులు చేసి మరీ కప్పేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్తుల తరఫున ఓ వ్యక్తి కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. చెరువును టీడీపీ నాయకులు కూనపల్లి కిషోర్ కుమార్, బత్తుల గిరిబాబులు ఆక్రమిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నాయకుల బరితెగింపు అనే శీర్షికతో అప్పట్లో సాక్షిలో కథనం ప్రచురితమైంది. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు ఆక్రమణ జరిగినట్లు నిర్ధారించి సంబంధిత వ్యక్తులకు గ్రామ పెద్దల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత పోలీసుల ప్రొటెక్షన్ లేకపోవడంతో పూర్తి స్థాయిలో హద్దులు నిర్ణయించలేకపోయారు. గురువారం లావేరు తహసీల్దార్ జీఎల్‌ఈ శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం పోలీసులు సమక్షంలో రెవెన్యూ అధికారులు చెరువు సరిహద్దులు నిర్ధారించారు. ఎవరైనా ఆక్రమణలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఐ హారతి, ఏఎస్‌ఐ, గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు.
టీడీపీ నేతల బరితెగింపునకు చెక్


