ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలం అప్పగింత
పొందూరు: ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటూ విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తమ్మినైన అప్పలనాయుడు తన స్వస్థలం పొందూరు మండలంలోని తాడివలస గ్రామంలోని తన సొంత స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు దానం చేశారు. గ్రామంలో 1.5 సెంట్లలో ఉన్న తన పెంకుటింటిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి దానపట్టా కింద రిజిస్ట్రేషన్ చేసి పంచాయతీ కార్యదర్శి రామరాజీవ్‌కు పత్రాలను అందజేశారు. మరో చోట 5 సెంట్ల స్థలాన్ని బీసీ వసతి గృహ నిర్మాణం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను ఆ శాఖ అధికారి బి.అనురాధకు అందించారు. ఈయన గతంలో తాడివలస జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడంతో పాటు రూ. 4 లక్షలతో భోజనశాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న రామమందిరం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆయన దాతృత్వానికి సర్పంచ్ మణెమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
నందిగాం: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టపోయిన వరి పంట వివరాలను సేకరించి నష్టాలను అంచనా వేస్తున్నా మని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని దిమిలాడ, రాంపురం గ్రామాల్లో ఆయన ఆచా ర్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిలో పంట ఉండిపోవడం, మొలకలు వచ్చిన పంటను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలను అంచనా వేస్తున్నామని, నష్టం వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. అలాగే నీటిలో మునిగిన పంటను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఆయన వెంట అనకాపల్లి రీసెర్చ్ డైరెక్టర్ సీహెచ్ ముకుందరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఉన్నారు.
‘మీ మూలధనం..
మీ హక్కు’ పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభా గం ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి ‘మీ మూలధనం.. మీ హక్కు’ ప్రత్యేక ప్రచార కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వరరావు, పీడీ డీఆర్‌డీఏ కిరణ్ కుమార్, బీసీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డ్వామా పీడీ సుధాకర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజా పాల్గొన్నారు. జిల్లాలో డెఫ్ రూపంలో ఉన్న రూ.87.13 కోట్ల ప్రజాధనం వారికే చెందడం, తద్వారా జిల్లాలో మొత్తం 4,21,944 ఈ తరహా ఖాతాలు కలిగిన లబ్ధిదారులకు మేలు చేకూరేలా చేయడం, అలానే బీమా సంస్థల్లో ఉన్న ఇలాంటి నిద్ర ఖాతాలను వారికి అందేలా చేయడం దీని ఉద్దేశమని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలం అప్పగింత


