ఇప్పుడు జప్తు నోటీసులా..?
రోడ్డున పడేసి..
● అరసవల్లి ఆలయం ముందు దుకాణదారుల ఆవేదన
● కరెంట్ మీటర్లు తొలగించి ఇప్పుడు బకాయి నోటీసులు ఇవ్వడంపై విస్మయం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నా యి. కూటమి ప్రభుత్వం వచ్చాక తాత్కాలిక ఉద్యోగులు, దుకాణదారులు వంటి వారు నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఆలయానికి రూ.వంద కోట్ల ప్రాజెక్టు వచ్చేస్తోందంటూ హడావుడి చేసి ఈ ఏడాది జనవరిలోనే ఆలయం ముందున్న 11 దుకాణాలను నేలమట్టం చేసేశారు. సంక్రాంతి వరకు ఆగమన్నా ఆగలేదు. రథసప్తమి రాష్ట్ర పండుగ సంబరాలంటూ దుకాణదారుల కడుపు కొట్టారు. సరే దేవుడే ఉన్నాడంటూ వాళ్లంతా తోపుడు బళ్లపై ఆలయం ముందే ప్రసాదాలను, కొబ్బరికాయలను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతలో విద్యుత్ శాఖ నుంచి బకాయి నోటీసులంటూ తాజాగా శుక్రవారం వారికి నోటీసులు రావడంతో వారిలో ఆందోళన పెల్లుబికింది. కూల్చేసిన దుకాణాలకు బకాయిల బిల్లులేంటని విస్తుపోయారు.
ఆస్తులను జప్తు చేస్తారట..!
అరసవల్లి ఆలయానికి ఎదురుగా ఆలయానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 11 షాపులు ఉండేవి. ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా చేపట్టిన కూల్చివేతల పుణ్య మా అని జనవరి నుంచే వ్యాపారాలు లేక కుదేలయ్యారు. దుకాణాలు కూల్చేసిన సమయంలోనే విద్యుత్ మీటర్లను కూడా ఆయా శాఖ సిబ్బంది తొలగించేశారు. దీంతో అప్పటివరకు విద్యుత్ వినియోగానికి చెందిన విద్యుత్ బిల్లులను చెల్లించేశా రు. అయితే తాజాగా జనవరి నుంచి నేటి వరకు విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ 11 మందికి వేలాది రూపాయల బకాయిలున్నాయంటూ నోటీసులు జారీ అయ్యాయి. రానున్న ఏడు రోజుల్లో బకాయిలను చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని, అవసరమైతే వారి పేర్ల మీద ఉన్న మిగిలిన విద్యుత్ కనెక్షన్లను కూడా నిలుపుదల చేస్తా మంటూ హెచ్చరికల నోటీసులను విద్యుత్ శాఖ జారీ చేసింది. వాస్తవానికి జనవరి నుంచి ఆ తొలగించిన విద్యుత్ మీటర్లు వినియోగంలో లేవు. కానీ ఇప్పటివరకు బిల్లులను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంపై దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు జప్తు నోటీసులా..?


