
పరీక్ష పాట్లు..?
ప్రిన్సిపాల్స్‌కు అష్టకష్టాలు
ఆ మధ్య యోగా డే, ఇటీవల మెగా పేరెంట్స్ మీటింగ్, తాజాగా యూనిట్ టెస్ట్ పరీక్షలు, మరోవైపు ఆన్‌లైన్ అడ్మిషన్లు ఇలా ప్రిన్సిపాల్స్ కు ఊపిరి తీసుకునే సమయం ఉండడం లేదు. ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసేందుకు తగినంత సమయం లేకపోవడం, నిధులు కేటాయించకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో జిరాక్స్ సెంట ర్లు లేకపోవడం, కాలేజీల్లో వందలాది ప్రింట్లు తీసే ప్రింటర్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రంతో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్న సంగతి అటుంచితే.. మెజారిటీ కాలేజీల్లో నిర్దేశించిన సిలబస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. చాలాచోట్ల ఇప్పటికీ వివిధ సబ్జెక్టుల లెక్చరర్లు లేరు. ఈ మధ్యనే రేషనలైజేషన్ ప్రక్రియ, లెక్చరర్ల బదిలీలు, ప్రిన్సిపాల్స్ పదోన్నతలతో ఏర్పడిన ఖాళీల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. లెక్చరర్ల లేనిచోట దుస్థితి ఒకలా ఉంటే.. లెక్చరర్ల ఉన్నచోట్ల పరిస్థితి మరోలా ఉంది. విద్యార్థులకు చెప్పిన పాఠాలొకటి.. ఇచ్చిన ప్రశ్నలొకటని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం న్యూకాలనీ:
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి యూనిట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, సాంఘి క, గిరిజన, గురుకులం, మోడల్ కాలేజీలు, కేజీబీ వీలు, హైస్కూల్ ప్లస్‌లలో చదువుతున్న ఇంటర్మీడి యట్ విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తున్నారు. రోజుకు రెండు పరీక్షలు చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి సెషన్ ఉదయం 11.30 గంట ల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కాలేజీలు 94 ఉన్నాయి. వీటిల్లో 19 వేల మంది వరకు విద్యార్థులు వివిధ ఇంటర్ కోర్సుల్లో చదువుతున్నారు. ఈ యూనిట్ పరీక్షల కోసం గత పది రోజులుగా ఇంటర్ బోర్డు నానా హడావుడి చేసినప్పటికీ.. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు చేర్చడంలో సఫలీకృతం కాలేదని తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేసేందుకు కాలేజీల్లో నానా అగచాట్లు పడుతున్నారు. పరీక్షకు స్వల్ప వ్యవధి ముందు క్వశ్చన్ పేపర్‌ను వెబ్‌సైట్‌లో పెడుతుండడంతో ప్రిన్సిపాల్స్ కష్టాలు అన్నీఇన్నీ కావు.
డౌన్‌లోడ్ చేసి.. డిక్టేట్ చేస్తున్నారు
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల విద్యార్థులు యూనిట్ టెస్ట్‌లు, త్రైమాసిక, అర్థ సంవత్సర పరీక్షలను ఒకే ప్రశ్నాపత్రంతో రాసే విధానాన్ని 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు. నాటి ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇచ్చింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా జరుగుతున్న యూనిట్ టెస్ట్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు మెజారిటీ కాలేజీల్లో అందజేయలేదని తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేయాల్సిందేనని జిల్లా అధికారులు ఆదేశించినప్పటికీ.. వివిధ కాలేజీల్లో ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు డిక్టేట్ చేసినట్లు సమాచారం. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌పై లేదా బ్లాక్ బోర్డులపై క్వశ్చన్ పేపర్లలోని ప్రశ్నలను లెక్చరర్లు రాసి, తమను రాసుకోమంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఇంగ్లిష్, మ్యాథ్స్, కామర్స్ ఇతర ఒకేషనల్ పేపర్ల సందర్భంలో చాంతడంత ప్రశ్నలు రాయాల్సిన దుస్థితి తల్చుకుని ఆందోళన చెందుతున్నారు.
ప్రారంభమైన ఇంటర్మీయట్ యూనిట్ పరీక్షలు
చాలాచోట్ల ప్రశ్నపత్రాలు అందక అవస్థలు
కొన్నిచోట్ల డిక్టేట్ చేస్తుంటే రాస్తున్న వైనం
ఆందోళన చెందుతున్న విద్యార్థులు
సూచనలు చేశాం
యూనిట్ టెస్ట్ పరీక్షలపై ప్రిన్సిపాల్స్‌కు అనేక సూచనలు చేయడం జరిగింది. పరీక్షల ప్రశ్నాపత్రాలను ప్రింటౌట్ తీసి విద్యార్థులకు అందజేయాలని ఆదేశించడమైంది. కచ్చితంగా ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాలను కాలేజీల్లో అమలు చేయాల్సిందే. అమలు కాకుంటే చర్యలు తప్ప వు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– పి.దుర్గారావు, జిల్లా ఆర్‌ఐవో,
ఇన్‌చార్జి డీవీఈవో, శ్రీకాకుళం

పరీక్ష పాట్లు..?