
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్.ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర అధ్యక్షుడు అరుగుల గణేష్‌లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. గత రాష్ట్రవ్యాప్త సమ్మె సమయంలో ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం, ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనుకోవడం సరికాదని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాలు అందజేయాలి
తల్లికి వందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కూడా అందజేయాలని కోరారు. గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, హామీలకు జీవో జారీ చేయ్యాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని విన్నవించారు. ఇప్పటికై నా అట్టడుగు వర్గాలుగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు పరిష్కరించాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వీరికి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.గోవర్ధనరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావులు మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో ఎ.శంకర్, ఎ.మోహన్, డి.చిట్టిబాబు, ఆర్.యుగంధర్, ఎన్.పార్వతి, ఎ.లక్ష్మి, ఆర్.ఈశ్వరమ్మ, పి.మల్లమ్మ, కె.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.