
భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
కాశీబుగ్గ: కార్గో ఎయిర్‌పోర్టుకు సంబంధించి బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్ప ల అజయ్‌కుమార్, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.బాలాజీరావు, తమ్మినాన భాస్కర రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.గణపతి పిలుపునిచ్చారు. గురువారం పలాస సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్దానం తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ కార్గో ఎయిర్‌పోర్టు కోసం రైతుల అభిప్రాయం తెలుసుకోకుండా భూముల సర్వే చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పచ్చని ఉద్దానం విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోందని, ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు విచారకరమన్నారు. ఎవరు ఎన్ని ఆందోళనలు, ధర్నాలు చేసినా ఎయిర్‌పోర్టు నిర్మాణం ఆగదని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రకటన రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.