
ఇదేం తీరు..!
● వైద్యారోగ్య శాఖలో బదిలీలపై ఎమ్మెల్యేల అత్యుత్సాహం ● సిఫారసు లేఖల ప్రకారం బదిలీలు చేశారా.. లేదా? ● ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు? ● వివరంగా జాబితాలు పంపాలని ఆదేశం
అరసవల్లి : కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుతో జిల్లా స్థాయి అధికారులు అవస్థలు పడుతున్నారు. పోస్టింగ్‌లకు, బదిలీలకు, ఇతరత్రా పనులకు ఒక్కో ఎమ్మెల్యే తమ ప్రాంతీయులకు అనుకూలంగా సిఫారసు లేఖలు పంపిస్తూ.. ఎలాగైనా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. తాజాగా జిల్లా వైద్యారోగ్య శాఖలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల బదిలీల ప్రక్రియ జూమ్ విధానంలో వివాదాస్పదంగా జరిగిన సంగతి విదితమే. నేతల ఒత్తిళ్లతో కూడిన సిఫారసు లేఖలు కూడా ఇందుకు ప్రధాన కారణం కాగా.. కార్యాలయంలో ఓ ఇద్దరు కీలక ఉద్యోగుల చేతివాటం మరో కారణమనే ఆరోపణలు వినిపించాయి. మొత్తానికి బదిలీల ప్రక్రియ ఎలాగోలా ముగిసింది. పోస్టింగుల స్థానాలను కేటాయించగా.. చాలావరకు జాయినింగ్‌లు కూడా అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ అధికారులకు చేతినిండా పనిపడింది. బదిలీలు చేసిన జాబితాలను తిరగేస్తూ బుధవారం కార్యాలయంలో బిజిబిజీగా కనిపించారు.
జాబితా కోసం...!
గ్రామ/వార్డు సచివాలయాల్లో మొత్తం 605 మందికి బదిలీలు చేశారు. పేరుకు నిబంధనల ప్రకారం చేసామని అధికారులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నా.. వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగాయనేది బహిరంగ సత్యం. బదిలీల ప్రక్రియలో ప్రత్యేకంగా పేర్లతో కూడిన జాబితాలను నేరుగా ఎమ్మెల్యేల సంతకాలతోనే జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపించారు. వీరికి మాత్రమే కోరుకున్న స్థానాల్లో బదిలీలు చేయాలని హుకుం జారీ చేశారు. సిఫారసు లేఖల ద్వారా అందిన సుమారు మూడు వందల మందికి పైగా పేర్లలో చాలావరకు ఏఎన్‌ఎంలకు కోరుకున్న స్థానాల్లో బదిలీలు చేశారు. తీరా ఇప్పుడు చూస్తే.. ‘అసలు మేం ఇచ్చిన సిఫారసు లేఖల్లో ఎవెరెవరికి బదిలీలు చేశారో..’ అన్న జాబితాలను తిరిగి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలంటూ మౌఖిక ఆదేశాలు రావడంతో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు అదే పనిలో పడ్డారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే 8, ఎచ్చెర్ల ఎమ్మెల్యే 10, ఆమదాలవలస ఎమ్మెల్యే 22, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, పలాస నరసన్నపేట తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం నాలుగైదు విడతలుగా సిఫారసుల లేఖలతో బదిలీలు చేయాలని లేఖలు అందాయి. ఈ లేఖల ప్రకారం ఎవరికి చేయలేదో.. చేయకపోవడానికి కారణాలేంటో లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేలకు తెలియాలట! ఇదే పనిలో డీఎంహెచ్‌వో కార్యాలయ పరిపాలనావిభాగం, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగాలు తెగ కష్టపడుతున్నాయి. ఇదీ కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు.