
ఎడ్యుకేషన్..
పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
రణస్థలం/ఎచ్చెర్ల: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ పాలిసెట్–2025 తుది విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యులు, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త కె.నారాయణమూర్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరై సీటు పొంది కళాశాలలు, బ్రాంచ్‌లు మారాలనుకునేవారు మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు ప్రోసెసింగ్ ఫీజు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకూ సహాయ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలన్నారు. ఈ నెల 21న సీట్ల కేటాయింపు జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
రణస్థలం: పాలిటెక్నిక్ డిప్లమో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ ఈసెట్–2025 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త కె.నారాయణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి విడతలో సీటు పొంది మళ్లీ కళాశాల మారాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు ప్రోసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేయాలన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రోసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాలు పరిశీలనకు ఆప్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ నెల 21న ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉందన్నారు. ఈ నెల 22న సీట్ల కేటాయింపు జాబితా విడుదల అవుతుందన్నారు. 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
పాలిటెక్నిక్ సెకెండియర్‌లో స్పాట్ అడ్మిషన్లు
రణస్థలం: ఇంటర్మీడియట్ ఒకేషనల్ గ్రూప్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లమో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 19న శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త కె.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.