
అయ్యో అన్నదాత..!
అయ్యో.. అన్నదాత..!
ఇచ్ఛాపురం రూరల్: ‘ఖరీఫ్ నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతుల వినతి మేరకు మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకాన్ని రూ.9 కోట్లతో పునరుద్ధరిస్తాం’ అని గతేడాది నవంబర్ 1వ తేదీన ఈదుపురం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలు చెప్పి నేటికి 8 నెలలు కావస్తున్నా ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో సీఎం హామీపై ఆశలు పెట్టుకున్న అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు.
1,200 ఎకరాలకు సాగునీరు
ఇచ్ఛాపురం మండలం కొఠారీ, పూర్ణాటకం, పత్రిపుట్టుగ, ధర్మపురం గ్రామాలతో పాటు కవిటి మండలంలోని భైరిపురం, వింధ్యగిరి, రాజపురం, లండారిపుట్టుగ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉండే 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ఏకై క ఎత్తిపోతల పథకం జైకిసాన్ ఎత్తిపోతల పథకం. ఈదుపురం బాహుదా నది పక్కన 2004లో నిర్మించారు. కేవలం వర్షాధారంపై పండించే ఈ ప్రాంత రైతులకు జైకిసాన్ ఎత్తిపోతల పథకం వరంగా మారింది. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు సక్రమంగా పంటలను పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉప్పొంగడంతో ఎత్తిపోతల పథకం నీట మునిగింది. దీంతో యంత్రాలు పాడైపోయాయి. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయడంతో మరో ఐదేళ్ల పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరాయి. 2018 అక్టోబర్‌లో వచ్చిన తిత్లీ తుఫాన్‌కు బాహుదా వరద నీటిలో ఎత్తిపోతల పథకం 15 రోజుల పాటు ఉండిపోవడంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పటినుంచి ఏడేళ్లుగా 1200 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అక్కడి రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీతో ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కుతాం అనుకున్న రైతులకు అడియాసలే మిగిలాయి. రూ.9 కోట్లతో ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తెస్తామన్న ఆయన హామీ నీటిమూటగా మిగిలిపోయింది.
చుక్క నీరు లేదు
ఈదుపురం ఎత్తిపోతల పథకానికి ఆనుకొని ఉన్న భూములకు చుక్క సాగునీరు లేకుండా పోయింది. దీంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో నాకు రెండు ఎకరాల పంట పొలం ఉంది. గతంలో ఎత్తిపోతల పథకం ద్వారా రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగునీరు అందడం మూలంగా ఆనందంగా పంటలు పండించుకునేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం సత్వరమే పథకాన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– సంధాన పూర్ణచంద్రుడు,
డి.గొనపపుట్టుగ, కవిటి
సీఎం హామీ ఏమైంది
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీకే పత్తా లేకుండా పోయింది. రూ.9 కోట్లతో జైకిసాన్ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధించడం జరుగుతుందని ఆయన చెప్పడంతో వందలాది మంది రైతులు సంతోషించారు. ఈయన హామీకి నేటికి ఎనిమిది నెలలు కావస్తోంది. 2016లో కొఠారీ ఉమ్మడి చెరువు వద్ద పైపులైన్ ధ్వసం కావడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందకుండా పోయింది. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని పథకానికి జీవం పోస్తే మంచి జరుగుతుంది.
– దుక్క ధనలక్ష్మి,
సర్పంచ్, కొఠారీ, ఇచ్ఛాపురం
పత్తా లేకుండా పోయిన
సీఎం చంద్రబాబు హామీ
మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకం
మొదలైన ఖరీఫ్ కష్టాలు

అయ్యో అన్నదాత..!

అయ్యో అన్నదాత..!

అయ్యో అన్నదాత..!