
చీకట్లో వైద్యారోగ్య శాఖ కార్యాలయం
● వారం రోజులుగా సింగిల్ ఫేజ్ విద్యుత్‌తో ఉద్యోగుల అవస్థలు
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం అంధకారంలో ఉంది. నాలుగు అంతస్తుల్లో వివిధ హోదాల్లో వైద్యాధికారుల ఛాంబర్లు పనిచేస్తుండగా.. ఏకంగా వారం రోజులు నుంచి ఎక్కడా పూర్తిస్థాయిలో విద్యుత్ సప్లయ్ లేకుండాపోయింది. దీంతో వైద్య శాఖలో కీలక ఫైళ్లు పెండింగ్‌లో ఉండాల్సి వస్తోంది. విద్యుత్ పూర్తిస్థాయి సప్లయ్ లేకపోవడంతో సింగిల్ ఫేజ్ అవస్థలు ఉద్యోగులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. నిత్యం వందలాది మంది రాకపోకలతో హడావుడిగా ఉండాల్సిన కార్యాలయంలో కంప్యూటర్లు పని చేయ్యక నిత్యం ఉన్నతాధికారులకు పంపాల్సిన నివేదికలు కూడా పెండింగ్‌లో పడ్డాయి. కొందరు కంప్యూటర్ ఆపరేటర్ల సొంత ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా కొంత మేరకు ఎమర్జెన్సీ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతానికి సింగిల్ ఫేజ్ వలన కొన్ని స్విచ్ బోర్డులు మాత్రమే పని చేస్తుండడంతో అక్కడికి డెస్క్‌టాప్ కంప్యూటర్లను తీసుకుని వెళ్లి ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. అయినప్పటికీ విద్యుత్ అవస్థలపై సంబంధిత విద్యుత్ శాఖకు ఇంతవరకు ఎవరూ ఫిర్యాదులు చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొందరు ఉద్యోగులు మార్నింగ్ హాజరు వేసుకుని ఎంచక్కా సొంత పనుల్లో బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు కార్యాలయంలో విధులు చేపట్టకుండా బయటే తిరుగుతున్నట్లు సమాచారం. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డీసీహెచ్‌ఎస్ అఽధికారి కూడా ఇదే భవనంలో ఉంటున్నప్పటికీ.. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.