
బరితెగించిన ఆక్రమణదారులు
సంతబొమ్మాళి: మండలంలోని పోతునాయుడుపేట గ్రామంలో ఆక్రమణదారులు బరితెగించారు. సాగునీటి కాలువ, రోడ్డుకు మధ్య ఉన్న సుమారు 30 సెంట్లు స్థలం కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వేసిన తాగునీటి బోరును పీకేసి ఆనవాలు లేకుండా చేశారు. దీంతో తాగునీటికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆక్రమణదారులను గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడంతో భయపడి ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో పాటు రోడ్డుకు అనుకొని ఉన్న బెర్ముతో పాటు సాగునీటి కాలువ గట్టును కూడా ఆక్రమించి మట్టిని వేసి కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో అవి కూడా తొలగించమని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఆక్రమణదారులు గొడవపడిన సంఘటనలు ఉన్నాయి. ఆక్రమించిన స్థలంలోని 11 సెంట్లును వేరొక వ్యక్తికి ఆక్రమణదారులు అమ్మి తప్పుడు సర్వే నంబర్‌తో రిజిస్టేషన్ చేయించారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్ హేమసుందర్‌ను దీనిపై వివరాలు అడుగగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.