
అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సంఘ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలన్నారు. 42 రోజుల సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నేటికి అమలు చేయలేదన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న చేపట్టనున్న అఖిలభారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ, నాయకులు పి.లతాదేవి, కె.సుజాత, జె.కామేశ్వరి, కె.లక్ష్మి, ఎస్.ఆదిలక్ష్మి, జ్యోతి, మాధవి, అప్పలనర్సమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.