
హరికథకు పునరుజ్జీవం
శ్రీకాకుళం కల్చరల్: హరికథకు పునరుజ్జీవనం చేస్తున్న సుమిత్రా కళాసమితి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో పులఖండం శ్రీనివాసరావు స్మారకంగా హరికథా నవరత్నల ప్రదర్శనలు మొదటి రోజు ఆదివారం ప్రారంభమయ్యాయి. గుంటూరుకు చెందిన తిరువళ్లూరి దివ్య శివ భాగవతారిణిని ‘సుందరకాండ’ కథను చక్కగా వినిపించగా, వయొలిన్‌పై మావుడూరి సత్యనారాయణ, వాయునందరావు, మృదంగంపై మావుడూరు సూర్యప్రసాదశర్మ వాద్య సహకారం అందించారు. ముందుగా కళామందిరం ఆవరణలో ఉన్న హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, గౌరవాధ్యక్షుడు కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ చిన్నవయసులోనే హరికథను నేర్చుకొని చెప్పడం గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో సుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తు చిన్నారావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, నక్క శంకరరావు, నీరజా సుబ్రహ్మణ్యం, బంకుపల్లి రమేష్‌శర్మ, పూసర్ల నగేష్, కొంక్యాన మురళీధర్, వి.వి.ఆర్ మూర్తి, ఎం.రాజు, ఎం.వరలక్ష్మీ, పూజ, ఉషారాణి, రాజు తదితరులు పాల్గొన్నారు.