
తహసీల్దార్ కార్యాలయంలోనికి వర్షపు నీరు
సారవకోట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ మాత్రం వాన కురిసినా నీరు కార్యాలయం లోపలకు వచ్చేస్తోంది. శని, ఆదివారాల్లో చిన్నపాటి వర్షం కురవడంతో కార్యాలయపు కంప్యూటర్ గదిలోకి నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు లోపలకు రావడంతో ముఖ్యమైన కంప్యూటర్ పరికరాలు, పత్రాలు తడిసి పోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.
‘వీఆర్‌ఏలతో వెట్టిచాకిరీ తగదు’
ఆమదాలవలస: పార్ట్‌టైమ్ పేరుతో వీఆర్‌ఏలతో వెట్టిచాకిరీ చేయించడం ప్రభుత్వానికి తగదని రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకిసాహెబ్ అన్నారు. వీఆర్‌ఏల సంఘం శ్రీకాకుళం ఏడో జిల్లా మహాసభ ఆమ దాలవలసలో టి.త్రినాథరావు అధ్యక్షతన ఆది వారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేస్తోందని తెలిపారు. ఇక్కడ కూడా పే స్కేల్ అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 46 కార్మిక చట్టాలను కేంద్రం కాలరాస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారాటాలతోనే తిప్పి కొట్టాలని పిలు పునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా అల్లు సత్యనారాయణ, అధ్యక్షుడిగా టి.త్రినాథరావు, ఉపాధ్యక్షుడిగా ఎన్.సీతప్పుడు తదితరులను ఎన్నుకున్నారు.
జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ సేవల్ని దేశప్రజలు ఎన్నడూ మరిచిపోలేరని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా అరసవల్లి కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ప్రధానిగా అనేక సంస్కరణలు చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు పొన్నాడ రుషి, రాష్ట్ర కళింగ కోమటి మాజీ అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, పట్టణ అధ్యక్షు డు సాధు వైకుంఠరావు, సంఘ సంస్కర్త మంత్రి వెంకటస్వామి, రాష్ట్ర పెన్షనర్స్ అండ్ ఎంప్లాయిస్ జనరల్ సెక్రటరీ బుక్కూరు ఉమామహేశ్వరరావు, డాక్టర్ సెల్ మాజీ ఆధ్యక్షుడు శ్రీనివాస్ పట్నాయక్, అరసవల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జలగడుగల శ్రీనివాసరావు, పట్టణ విభాగం కార్యవర్గ సభ్యుడు అర్జి ఈశ్వరరావు, శోభన్, త్రినాథ, కడియం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
మందస: కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా మందస మండలం రాంపురంలో గ్రామ కమి టీ అధ్యక్షుడు దున్న రామారావు నేతృత్వంలో ఆదివారం లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా రైతు మాట్లాడుతు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎయిర్ పోర్టు నిర్మాణం తగదన్నారు. రాజకీయాలకు అతీతంగా భూములను మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.