
రైలు ఢీకొని 13 పశువులు మృతి
పాతపట్నం: మండలంలోని హరిద్వారం గ్రామానికి చెందిన ఏడుగురు పాడి రైతులకు చెందిన 13 పశు వులు ఆదివారం రైలు ఢీకొని మృతి చెందగా, మరో నాలుగు పశువులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో హరిద్వారం గ్రామానికి చెందిన పశువులను అదే గ్రామానికి చెందిన గోగ్గి లక్ష్మినారాయణ మేతకు తీసుకుపోయారు. హరిద్వారం, బొమ్మిక గ్రామాల మధ్య రైల్వేట్రాక్‌ను పశువులు దాటుతుండగా పూరి నుంచి గుణుపూర్ (ప్రత్యేక రైలు) రైలు ఢీకొని 13 పశువులు మృతి చెందాయని, మరో ఐదు పశువులకు తీవ్రగాయాల య్యాయని పాడి రైతులు తెలిపారు. హరిద్వారానికి చెందిన లోకలాపు ఆదినారాయణకు చెందిన ఆరు, బోదుడు సోములకు చెందిన రెండు, గొగ్గి శిమ్మయ్య, కలగ రమేష్, బొమ్మాళి అప్పలరాజు, ఎన్ని పాపా రావు, బొడ సింగిరిడికు చెందిన ఒక పశువు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి పశుసంవర్ధశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాడి రైతులు కోరారు.