
విత్తన సమస్యలు తలెత్తకూడదు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
రైతులకు సత్వరమే విత్తనాలు పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తనాల సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వరి విత్తనాలు పంపిణీపై ఆరా తీయగా.. ఖరీఫ్‌లో 33,622 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి వెల్లడించారు. 1520 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. యూరియా, డీఏపీ, తదితర ఎరువులు 69.05 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు 13,495 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో మూడు సీహెచ్‌సీ గ్రూపులకు 80 శాతం సబ్సిడీపై డ్రోన్లు సరఫరా చేసినట్లు తెలిపారు. ఏపీఎంఐపీ ఉప సంచాలకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలాల వారీగా పంటల వివరాలను వివరించారు. పశుసంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాల్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ చురుగ్గా జరుగుతోందని చెప్పారు. మత్స్య శాఖ ఉప సంచాలకుడు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 15,584 మందికి మత్స్యకార సేవ పథకం వర్తింపజేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాహ యోజన కింద ఇప్పటికే 13 కో ఆపరేటివ్ సొసైటీలు అప్రూవల్ అయినట్లు వివరించారు సముద్రంలో నాచు పెంచడం అనేది జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద చేపడుతున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించడానికి భావనపాడు, బారువ ప్రాంతాలను గుర్తించామని, ఒక్కోచోట 30 మందికి జూలై 4 నుంచి 9 వరకు శిక్షణ ఇస్తామని డీడీ వివరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు సిద్ధం చేసుకోవాలి
వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో కలెక్టర్