
పేరుకే సన్న బియ్యం.. నిండా పురుగులే
నరసన్నపేట: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కోసం పంపిణీ చేస్తున్న బియ్యం నిండా పురుగులు, నూకలు ఉంటున్నాయి. గురువారం స్థానిక జిల్లా పరిషత్( బోర్డు) ఉన్నత పాఠశాల, మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో బియ్యంను పరిశీలించగా పురుగులు కనిపించాయి. ఈ సందర్భంగా వంట ఏజెన్సీ ప్రతినిధులు కాంతమ్మ ,రుప్ప శాంతలు మాట్లాడుతూ బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, అలాగే నూకల శాతం కూడా అధికంగా ఉందని తెలిపారు. ముక్కు వాసన వస్తున్నాయని అన్నారు. ఒకటికి రెండు మార్లు పరిశుభ్రం చేశాక వండుతున్నట్లు తెలిపారు.
పాఠశాల బియ్యం వెనక్కి..
టెక్కలి రూరల్: మండలంలోని చాకిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యాన్ని ఇటీవల పౌరసరఫరాల శాఖ నుంచి పంపిణీ చేశారు. అందులో ఒక బ్యాగ్ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టి, బియ్యం మొత్తం ఉండలు కట్టి ఉండటంతో దాన్ని గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు ఆ బియ్యా న్ని రెండు రోజులు కిందట వెనక్కి పంపించి దానిస్థానంలో మరో బియ్యం బ్యాగ్ తీసుకున్నారు.
నెలవంకలో..
కవిటి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదపిల్లల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యం నాసిరకంగా మారింది. మండలంలోని నెలవంక ప్రాథమిక పాఠశాలలో ‘సాక్షి’ చేసిన పరిశీలనలో బియ్యం నాసిరకంగా ఉన్నట్లు తేలింది. అట్టకట్టిన బియ్యాన్ని వండలేక వాటిని ఏం చేయాలో అర్థం కాక వంట ఏజెన్సీ మహిళలు సతమతమయ్యారు. రెండు బస్తాల్లో ఈ తరహా బియ్యం వారికి కనిపించింది.

పేరుకే సన్న బియ్యం.. నిండా పురుగులే