
నేడు వంశధార నీరు విడుదల
హిరమండలం: జిల్లాలో ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వంశధార గొట్టాబ్యారేజీ నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా బుధవారం నీటి విడుదలకు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, వంశధార ఉన్నతధికారుల చేతులమీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు గొట్టా బ్యారేజీ డీఈఈ బి.సరస్వతి మంగళవారం తెలిపారు. వర్షాలు ఆశాజనకంగా లేకున్నా బ్యారేజీలో కొంతవరకు నీటిని నిల్వ చేశామని, ఖరీఫ్ అవసరాలకు తగినట్టు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యారేజీలో 38.01 మీటర్ల నీటిమట్టం ఉంది.
ఎయిర్ పోర్టు పేరుతో గ్రామాలకు రావద్దు
వజ్రపుకొత్తూరు రూరల్: కార్గో ఎయిర్ పోర్టు పేరుతో సర్వేలకు తమ గ్రామాలకు రావద్దంటూ బాధితులు నినాదాలు చేశారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ పేరుతో గ్రామానికి వచ్చిన సర్వే బృందాలను మంగళవారం చీపురుపల్లి శివారు ప్రాంతంలో బాధితులు అడ్డుకున్నారు. గత కొంత కాలంగా కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి తో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముందుకు వెళ్లడం సరికాదని అన్నారు. పచ్చని ఉద్దానం నాశనం చేసేందుకు తాము సిద్ధంగా లేమని తమ పంటలను, ప్రాంతాన్ని కాపాడుకుంటామని అన్నారు.
జగన్మోహినిగా..
శ్రీకాకుళం కల్చరల్: జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా ఇల్లీసుపురం కూడలిలో గల జగన్నాథ స్వామిని మంగళవారం జగన్మోహిని అవతారంలో అలంకరించారు. సుభద్ర, బలభద్రలతో పాటుగా జగన్నాథ స్వామిని అలంకరించగా, భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
కూర్మనాథుని హుండీ కానుకల ఆదాయం రూ.14,16,732
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయ హుండీ కానుకల ద్వారా రూ.14,16,732 ఆదాయం వచ్చిందని ఈఓ కె.నరసింహనాయుడు తెలిపారు. మంగళవారం ఆలయ బేడా మంటపం వద్ద పర్యవేక్షణాధికారి కె.నాగేశ్వరరావు సమక్షంలో ఆలయ హుండీలతో పాటు సమీప పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. 98 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీహెచ్. సీతారామనృసింహాచార్యులు, అర్చకులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

నేడు వంశధార నీరు విడుదల