మేడ మీద నుంచి జారిపడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

మేడ మీద నుంచి జారిపడి వ్యక్తి మృతి

Published Tue, May 28 2024 10:40 AM

మేడ మ

శ్రీకాకుళం క్రైమ్‌ : నగరంలోని గూనపాలెంలో నివాసముంటున్న ఓ వ్యక్తి మేడ మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందారు. ఒకటో పట్టణ ఎస్‌ఐ బలివాడ గణేష్‌ తెలిపిన వివరాల మేరకు.. దూగాన సత్యనారాయణ (42) వంట మాస్టారుగా పనిచేసుకుంటూ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఐదేళ్లుగా గూనపాలెంలోని అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. భార్య విజయలక్ష్మి చేగొడియాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు సత్యనారాయణ వంట పనులు ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ రాత్రి 12 గంటల వరకు గడిపారు. వేసవి ఉక్కబోత కారణంగా ఇంటిపైన రెండో ఫ్లోర్‌ మేడ మీద పడుకుంటానని భార్య, కుమార్తెలతో చెప్పి వెళ్లారు. సోమవారం వేకువజాము ఐదు గంటల సమయంలో పక్కింటిలో నివసిస్తున్న ఆర్‌.పద్మావతి వచ్చి విజయలక్ష్మిని లేపి నీ భర్త పెరడులో ఉన్న బురదగుంట, ముళ్లకంప మధ్యలో గాయాలతో పడి ఉన్నాడని చెప్పడంతో ఆమె వెళ్లి చూసే సరికి.. సత్యనారాయణ కొన వూపిరితో పడి ఉన్నాడు. తలకు బలమైన గాయమైంది. దీంతో ఆటోమీద హుటాహుటిన రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే ఉదయం 6.30కు ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మేడపై భాగాన ఎలాంటి పిట్ట గోడ లేకపోవడంతో నిద్రలో దొర్లుకుంటూ తన భర్త కింద పడిపోయి ఉంటాడని భార్య విజయలక్ష్మి చెప్పడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

పాత వస్తువుల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

● రూ. 50 లక్షలకు పైగా ఆస్తినష్టం

నరసన్నపేట: జాతీయ రహదారి–16 సర్వీసు రోడ్డును ఆనుకొని స్థానిక హెచ్‌పీ గిడ్డంగి వద్ద ఉన్న పాత వస్తువుల గోడౌన్‌లో సోమవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చాలా గంటల పాటు అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ మార్గంలో ప్రయాణించడానికే వాహనదారులు భయపడ్డారు. పక్కనే ఉన్న హెచ్‌పీ గోడౌన్‌కు ఈ ప్రమాద వేడి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్యాస్‌ సిలెండర్లను అక్కడి నుంచి తరలించారు. గిడ్డంగిలో ప్రమాద సమయానికి 90 టన్నులకు పైగా వివిధ పాత వస్తువులు ఉన్నట్లు సమాచారం. ప్లాస్టిక్‌ వస్తువులతో పాటు ఇనుప వస్తువులు, వాటర్‌ బాటిల్స్‌, వివిధ రకాల మిషన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో రూ. 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని గిడ్డంగి యజమాని కోరాడ వైకుంఠరావు (బుజ్జి) తెలిపారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం గాలి తీవ్రత అధికంగా ఉండటంతో మంటలను అదుపు చేయలేకపోయారు. సాయంత్రం వరకూ దట్టమైన పొగ ఆ ప్రాంతంలో జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. వేకువజాము 3 గంటల నుంచి ఉదయం 10 వరకూ మంటలు వస్తూనే ఉన్నాయి. దీనిపై యజమాని స్పందిస్తూ ఇది ప్రమాదం కాదని, కావాలనే కొందరు నాలుగు వైపులా మంటలు పెట్టి ఉంటారని వైకుంఠరావు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం మంటలను అదుపు చేశారు.

మేడ మీద నుంచి జారిపడి వ్యక్తి మృతి
1/1

మేడ మీద నుంచి జారిపడి వ్యక్తి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement