బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లి బాలికల ఉన్నత పాఠశాల వెనుక వేల్పుమడుగు రోడ్డులో నారాయణ, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒకే ఒక్క కుమారుడు రాజా (36) ఉన్నాడు. వారు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి వద్ద హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ప్రస్తుతం హోటల్ జరగక తీసేశారు. పదో తరగతి వరకూ చదివిన రాజా బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అతనికి పెళ్లి అయినా దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో విడిపోయారు. అయితే రాజా కామెర్ల బారిన పడ్డాడు. ఆ సమయంలో సరైన చికిత్స చేయించుకోకపోవడంతో కిడ్నీలు చెడిపోయాయి. బోధకాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది.
మూడేళ్లుగా సపర్యలు
కిడ్నీలు చెడిపోవడంతో పాటు బోధకాలు రావడంతో రాజా మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆయన ఆలనపాలనా అంతా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇప్పటికే రాజాను బతికించుకునేందుకు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. చికిత్స, ఆపరేషన్ చేయించాలంటే రూ.40 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారని నారాయణ, రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు, మానవతావాదులు సాయం చేసి తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. తనకు బతకాలని ఉందని, సాయం చేయాలని రాజా ఆర్థిస్తున్నాడు.
చెడిపోయిన కిడ్నీలు, బోధకాలుతో ఒక్కగానొక్క కుమారుడి అవస్థలు
కొడుకును బతికించాలంటూ
తల్లిదండ్రుల వేడుకోలు
మానవతావాదులు, దాతలు
సాయం చేయాలని వినతి
సాయం చేయాలనుకునే వారు..
రాజా చికిత్స, ఆపరేషన్ కోసం మానవతా దృక్పథంతో ఆర్థికసాయం చేయాలనుకునే వారు పేరు: DEVARA NARAYANA, APGP BANK A/C NUMBER : 19111576036, IFSC CODE : APGP0001056కు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే సెల్ నంబర్ 8978422487కు ఫోన్ పే ద్వారా కూడా ఆర్థికసాయం అందించవచ్చని తెలియజేశారు.
విధి వెక్కిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచి, వారిని పోషించాల్సిన వయస్సులో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యానికి గురై మంచాన పడటంతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు. మూడేళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడిని బతికించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.


