రైతు సిద్ధం..
పుట్టపర్తి అర్బన్: కీలకమైన ఖరీఫ్ సీజన్ జూన్ 1న ప్రారంభం కానుంది. జిల్లాలో ఎక్కువగా వేరుశనగ సాగులోకి రానుండగా...ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాలు సిద్ధంచేసుకుంటున్నారు. మే నెల సాధారణ సగటు వర్షపాతం 42.4 మి.మీ కాగా, ఇప్పటి వరకూ 39.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి విత్తనాలు సిద్ధం చేసి ఉంచాలి. కానీ ఈసారి విత్తన పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లే ప్రారంభం కాలేదని, వ్యవసాయాధికారులను అడిగితే మౌనమే సమాధానమవుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ప్రణాళిక లేక..
ఖరీఫ్ జిల్లా సాధారణ సాగువిస్తీర్ణం 2,69,152 హెక్టార్లుకాగా, అత్యధికంగా 1,51,824 హెక్టార్లలో వేరుశనగ సాగులోకి వస్తుంది. అయితే సాగు ఖర్చు పెరగడం, ప్రభుత్వం ఆదుకోకపోవడం, ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది వేరుశనగ కేవలం 69,420 హెక్టార్లలోనే సాగులోకి వచ్చింది. దిగుబడి కూడా అంతంతమాత్రమే కావడంతో రైతులు నష్టపోయారు. ఇక రబీలో సాగు చేసిన వేరుశనగ కూడా పెద్దగా లాభం చేకూర్చలేదు. జిల్లాలో పండిన పంటను ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేసి శుద్ధి చేసి విత్తనానికి సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఆ విషయమే మరచిపోయింది. దీంతో వేరుశనగను పక్క రాష్టాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించారు. ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఒక్క బస్తా కాయలు కూడా కొనుగోలు చేయక పోవడం, విత్తన ఏజెన్సీలకు బకాయి పడ్డ మొత్తాన్ని సకాలంలో చెల్లించక పోవడంతో తాజాగా విత్తన సరఫరాలో జాప్యం జరుగుతోంది.
ధర మాత్రం ఖరారు
జిల్లాకు 72,289 క్వింటాళ్ల విత్తన వేరుశనగను ప్రభుత్వం కేటాయించింది. రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు ధరలను సైతం ఖరారు చేశారు. కే–6 రకం విత్తన వేరుశనగ కాయలను క్వింటా పూర్తి ధర రూ.10,200 కాగా 40 శాతం సబ్సిడీ పోను రైతు రూ.6,120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 30 కిలోల బస్తాకు రూ.1,836 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీసీజీఎస్ రకం వేరుశనగకు రూ.1,836, కదిరి లేపాక్షి(కేఎల్) రకం విత్తనానికి రూ.1,710 మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే రిజిస్ట్రేషన్ల వివరాలు నేటికీ వెల్లడించలేదు. కనీసం ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం కూడా చెప్పక పోవడం గమనార్హం. ఏటా రైతులు వేరుశనగతో పాటు అధికంగా కంది సాగు చేస్తారు. కానీ ఈసారి కంది విత్తన పంపిణీకి మంగళం పాడినట్లు తెలుస్తోంది. కాకపోతే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు మాత్రం 50 శాతం సబ్సిడీతో అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వారంలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్
విత్తన రిజిస్ట్రేషన్లు
నేటికీ ప్రారంభించని వైనం
వేరుశనగ ధరలు ఖరారు చేసినా.. పంపిణీపై మౌనం
ఆందోళనలో అన్నదాతలు
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాల్సిన సర్కార్ చోద్యం చూస్తోంది. వారంలో సీజన్ ప్రారంభం కానుండగా... నేటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో రైతులు అధిక ధర వెచ్చించి వ్యాపారుల వద్ద విత్తనం కొనేందుకు సిద్ధమవుతున్నారు. నేటివరకూ పైసా సాయం చేయని చంద్రబాబు సర్కార్.. అదనపు భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


