ధర్మవరంలో టీ–3 బెట్టింగ్
క్రికెట్‌ను
వీక్షిస్తున్న
జనసందోహం
ధర్మవరం అర్బన్: రెండు, మూడు రోజుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్ చూసిన జనం... వన్డే మ్యాచ్‌లతో ఊగిపోయారు. ఆ తర్వాత టీ–20 మ్యాచ్‌లతో శివాలూగారు. సిక్స్‌లు, ఫోర్ల వరద పారుతుంటే స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు అతుక్కుపోయిన క్రికెట్ ప్రేమికులు తమను తాము మైమరిచి డ్యాన్సులు చేశారు. ఈ ఉత్సాహానికి తగ్గట్టే బెట్టింగ్ కూడా హీటెక్కింది. బాల్ బాల్‌కూ బెట్టింగ్ జరిగేది. ప్రస్తుతం ధర్మవరంలో ఇంకాస్త ముందుకు వెళ్లి టీ–3 మ్యాచ్‌లతో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.
బండరాళ్లే వికెట్లు...
రబ్బరు బాల్‌తో క్రికెట్... మూడే ఓవర్లు...
క్రికెట్ అంటే వికెట్లు, ప్యాడ్‌లు, గ్లౌజ్‌లు, అంపైర్, బౌండరీలు ఇలా అనేక రకాల నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం బండరాళ్లే వికెట్లు, ఒక బ్యాట్, రబ్బరు బాల్‌లో క్రికెట్. ప్రతి బాల్‌ను బాదడమే మ్యాచ్ ప్రత్యేకత. ఒక్కో టీంకు ఐదుగురు చొప్పున రెండు టీంలకు మొత్తం 10 మంది క్రీడాకారులుంటారు. మ్యాచ్ మొత్తం మూడు ఓవర్లే. ఏ టీం మూడు ఓవర్లలో ఎక్కువ స్కోరు చేస్తుందో... ఆ టీం గెలిచినట్లే. ఒక్కో మ్యాచ్‌కు రూ.లక్షలో పందెం. మూడు ఓవర్లలో ఒక టీం 50 పరుగులు చేస్తే... మరో టీం 51 పరుగులు చేసిందంటే ఆ టీం గెలిచినట్లే. ఒక్కో మ్యాచ్‌కు రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బెట్టింగ్ సాగుతోంది. కేవలం గంటలోపే మ్యాచ్ ఫలితం తేలుతోంది. వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే బెట్టింగ్ క్రికెట్ ఆడుతూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన క్రీడాకారులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వచ్చి బెట్టింగ్ క్రికెట్ ఆడుతున్నారు.
కూతవేటు దూరంలో పోలీసులు...
ధర్మవరంలోని క్రీడా మైదానానికి కూతవేటు దూరంలోనే డీఎస్పీ కార్యాలయం, వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లున్నాయి. ఇంత పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొంత మంది పోలీసులు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడే క్రీడాకారులతో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
మూడు ఓవర్ల మ్యాచ్..
రూ.లక్షల పందెం
ధర్మవరం క్రీడా మైదానంలో
యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్
తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్న
పోలీసులు
ధర్మవరంలో టీ–3 బెట్టింగ్


