గ్రామ కార్యదర్శులపైనే కన్ను
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో గ్రామ కార్యదర్శుల పాత్రపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ ద్వారా 2025 జనవరి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసిన వ్యవహారం రాష్ట్రంలోనే కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పంచాయతీ లాగిన్ ద్వారానే బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించారు. తొలుత పంచాయతీ లాగిన్ హ్యాక్ అయ్యిందేమోనని భావించారు. కానీ ప్రాథమిక విచారణ పూర్తయ్యాక అందరి కళ్లు గ్రామ కార్యదర్శులపైనే పడ్డాయి. కొమరేపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదుగురు కార్యదర్శులు పనిచేయగా.. ఒకరు మాత్రం ఎక్కువ రోజులు పనిచేశారు. ఆయా కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. శనివారం ప్రస్తుతం కొమరేపల్లి గ్రామ పంచాయతీ పనిచేస్తున్న మహేష్‌ను జిల్లా కేంద్రం పుట్టపర్తికి పిలిపించిన అధికారులు అతన్ని సమగ్రంగా విచారించినట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం కేంద్రంగా అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేసినట్లు సమాచారం.
ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపైనా
అనుమానాలు..
మరోవైపు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై డీపీఓతో పాటు డీఎల్‌పీఓ కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ ద్వారా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, తాము పంచాయతీ లాగిన్ వాడలేదని గ్రామ కార్యదర్శులు చెబుతున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ లాగిన్ సదరు గ్రామ కార్యదర్శికే తెలుస్తుంది. లేదంటే ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి తెలిసే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.
త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక..
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇప్పటికే విచారణ దాదాపుగా పూర్తి చేసిన అధికారులు.. సమగ్ర వివరాలతో నివేదిక రూపొందిస్తున్నారు. రేపోమాపో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
‘నకిలీ’ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో విచారణ వేగవంతం
గ్రామ కార్యదర్శుల పాత్రపై
దృష్టి సారించిన జిల్లా అధికారులు
తాజాగా గ్రామకార్యదర్శిని జిల్లా కేంద్రానికి
పిలిపించి విచారించిన వైనం
రేపోమాపో ప్రభుత్వానికి
నివేదిక ఇచ్చే అవకాశం


