‘పది’ంతల దోపిడీ
కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో కొన్ని పాఠశాలల నిర్వాహకులు అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ విద్యాసంస్థల్లో దోపిడీ మరీ ఎక్కువగా ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమనెవ్వరూ ఏమీ చేసుకోలేరని ఆయా విద్యాసంస్థల సిబ్బంది బహిరంగంగా అంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పది పరీక్షలకు 16 వేల మంది..
జిల్లాలో 307 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 16 వేల మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు శనివారంతో గడువు ముగిసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెగ్యులర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 ఫీజు వసూలు చేయాలి. అదే సప్లిమెంటరీ కింద మూడు సబ్జెక్టుల్లోపు పరీక్షలు రాసే వారి నుంచి రూ.110 మాత్రమే ఫీజు రూపంలో వసూలు చేయాలి. కానీ జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా 10 రెట్లు అదనంగా వసూలు చేశారు. జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో రూ.500 వరకు వసూలు చేశారు. ఇక కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ.1,000 నుంచి రూ.1.500 వరకూ తీసుకున్నారు, నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలల్లో రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ వసూలు చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రశ్నించలేని స్థితిలో తల్లిదండ్రులు..
పరీక్షల సమయంలో పిల్లలను ఎక్కడ ఇబ్బంది పెడతారోనన్న భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించలేకపోయారు. తాము వసూలు చేసిన డబ్బులో కొంత డీఈఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుందని పలు పాఠశాల యాజమానులు చెబుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. దీనిపై జిలా విద్యాశాఖ అధికారి కిష్టప్పను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కాకుండా అధిక మొత్తంలో వసూలు చేసినట్లు తేలితే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు.
పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో భారీగా వసూలు
ప్రభుత్వం నిర్ణయించింది రూ.125.. వసూలు రూ.1,000పైనే
నారాయణ సహా కార్పొరేట్ విద్యాసంస్థల్లో మరీ ఎక్కువ


