బైక్ రేసర్ల భరతం పడతాం
పెనుకొండ: జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా బైకులతో విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే రైసర్ల భరతం పడతామని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెనుకొండ బాబయ్య దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా గంధం రోజున (2వ తేదీ రాత్రి) జాతీయ రహదారిపై మాటు వేసి రేసింగ్‌తో పాటు ప్రమాదకర విన్యాసాలు చేసిన వారిని అడ్డుకుని 102 బైక్‌లు సీజ్ చేశామన్నారు. వాహనాల రికార్డుల ఆధారంగా బైకర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం జరిమానాలు విధించామన్నారు. పలువురు బైక్ రేసర్లు మరోసారి ఇలాంటి తప్పిదాలు చేయబోమని హామీ ఇచ్చిన నేపథ్యంలో తొలితప్పుగా భావించి వాహనాలను విడుదల చేశామన్నారు. రికార్డులు సక్రమంగా లేని వారికి 2, 3 రోజులు గడువు ఇచ్చామన్నారు. దాడుల్లో నలుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు 50 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో ఇదే విధమైన చర్యలు ఉంటాయని, యువత గ్రహించి బైక్ రేసింగ్‌లకు దూరంగా ఉండాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమావేశంలో డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్ తదితరులు ఉన్నారు.
హెచ్చరించిన ఎస్పీ సతీష్‌కుమార్
102 బైక్‌లు స్వాధీనం..జరిమానా
బైక్ రేసర్ల భరతం పడతాం


