స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్తే చాలు జనం వణికిపోతున్నారు. శరీరంపై చిన్న దద్దు వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏడాదిగా జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా యంత్రాంగం కనీసం వ్యాధి నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు కూ | - | Sakshi
Sakshi News home page

స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్తే చాలు జనం వణికిపోతున్నారు. శరీరంపై చిన్న దద్దు వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏడాదిగా జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా యంత్రాంగం కనీసం వ్యాధి నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు కూ

Dec 6 2025 9:21 AM | Updated on Dec 6 2025 9:21 AM

స్క్ర

స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్

ప్రశాంతి నిలయం/ హిందూపురం: జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ భయం వణికిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో జ్వరం వచ్చిన జనం భయపడిపోతున్నారు. వివిధ రకాల విషజ్వరాల మాదిరిగా ఇది కూడా ఓ రకం జ్వరమే అయినప్పటికీ, ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములుండే ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తేలింది.

స్క్రబ్‌ టైఫస్‌ ఓ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి..

స్క్రబ్‌ టైఫస్‌ అనేది ‘ఒరియంటియా సూసుగముషి’ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. పొదలు, పచ్చిక బయళ్లలో ఉండే నల్లులు (చిగర్‌ మైట్స్‌) ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. పరిమాణంలో చిన్నగా ఉండే నల్లులు మనిషికి తెలియకుండానే కాటు వేస్తాయి. అప్పుడు ఓరియంటియా సూసుగముషి బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్‌ టైఫస్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది.

వ్యాధి లక్షణాలు..

వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వాంతులు, పొడిదగ్గు, నీరసం, కుట్టిన చోట నల్లటి మచ్చలు, దద్దుర్లు ఉంటాయి. వ్యాధి ముదిరితే కామెర్లు, ఫీట్స్‌ లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అప్పటికీ చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు ఫెయిల్యూర్‌ కావడం, హృదయకండరాల వాపు, సెప్టిక్‌ షాక్‌, అంతర్గత రక్తస్త్రావం, తెల్లరక్తకణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. చికిత్స ఆలస్యమైతే మరణాలు కూడా సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.

జాగ్రత్తలు పాటించాలి..

స్క్రబ్‌ టైఫస్‌ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో పనిచేసే వారు, పశువుల కాపరులకు, తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో, దట్టమైన పొదలు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి సోకే ప్రమాదం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడకుండా ఉండవచ్చు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నల్లులు పెరిగే వాతావరణాన్ని నివారించాలి. ఇళ్లలో దోమతెరలు వాడాలి. అలాగే నేలపై పడుకోవడం, కూర్చోవడం చేయరాదు.

అందుబాటులో లేని పరీక్షా కేంద్రాలు..

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ ధర్మవరంలో 2, హిందూపురంలో 2, ఎన్‌పీ కుంటలో 1, అమడగూరులో 1 చొప్పున మొత్తం 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికీ నిద్రమేల్కోలేదు. వ్యాధి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఇప్పటివరకూ నిర్వహించలేదు. ఇక వ్యాధి నిర్ధారణకు పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణకు సబ్‌టైఫస్‌ ఐజీఎం అనే టెస్ట్‌ చేయాలి. కానీ స్థానికంగా ల్యాబ్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వైద్యులు అనుమానిత కేసులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి అక్కడ పరీక్షలు నిర్వహించి... నిర్ధారించిన తర్వాత ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స ఆలస్యమైతే బాధితుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లినా...స్క్రబ్‌ టైఫస్‌ అంటూ భయపెట్టి ఎలీసా టెస్టు చేస్తున్నారు. ఇందుకు భారీగా వసూలు చేస్తున్నారు.

హిందూపురం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు..

ఇటీవల హిందూపురం ఆస్పత్రికి నాలుగు స్క్రబ్‌ టైఫస్‌ అనుమానిత కేసులు వచ్చాయి. దీంతో బాధితుల నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. శుక్రవారం నుంచి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముగ్గురు చిన్నారులను అనుమానిత కేసులుగా నమోదు చేసి చికిత్సలు అందిస్తున్నారు.

జిల్లాలో 6 పాజిటివ్‌ కేసుల నమోదు

వైరల్‌ జ్వరాలకు తోడు టైఫస్‌ భయం

భయపడుతున్న జిల్లా వాసులు

అప్రమత్తంగా ఉండాలని

కలెక్టర్‌ సూచన

అప్రమత్తంగా ఉండాలి

స్క్రబ్‌ టైఫస్‌ జిల్లాలో క్రమక్రమంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశాం. వ్యాధిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులు సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలి.

– ఏ.శ్యాం ప్రసాద్‌, కలెక్టర్‌

జాగ్రత్తలు పాటించాలి

స్క్రబ్‌ టైఫస్‌ ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరం నిండుగా దుస్తులు ధరించడం, దోమతెరలు వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

– ఫైరోజా బేగం, జిల్లా వైద్య,

ఆరోగ్య శాఖ అధికారి

స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్1
1/2

స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్

స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్2
2/2

స్క్రబ్‌ టైఫస్‌... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement