‘నకిలీ’ తీగ లాగుతున్నారు
మడకశిర: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఒక్కొక్క తీగలాగుతూ డొంక కదిలిస్తున్నారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 2025 జనవరి నుంచి అక్టోబర్ 14 వరకు 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడంపై అధికారుల విచారణ ముమ్మరం చేశారు. జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం శుక్రవారం కొమరేపల్లిలోవిచారణ ప్రారంభించింది.
గ్రామ కార్యదర్శుల విచారణ..
కొమరేపల్లి పంచాయతీ 2020లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు కార్యదర్శులుగా పనిచేశారు. దీంతో అధికారులు విచారణ హాజరుకావాలని వారందరికీ నోటీసులు పంపారు. వీరిలో ముగ్గురు గ్రామ కార్యదర్శులు విచారణకు హాజరైనట్లు సమాచారం. మిగిలిన వారికి మరోసారి నోటీసు పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విచారణలో పాల్గొన్న గ్రామ కార్యదర్శులు.. తాము గ్రామ పంచాయతీకి చెందిన లాగిన్‌ను ఉపయోగించలేదని అధికారులకు తెలిపినట్లు సమాచారం. కానీ పంచాయతీ లాగిన్ నుంచే 2021, 2022 సంవత్సరాల్లో 5 బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబు సర్కార్ వచ్చాకే ‘నకిలీ’ బీజం..
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరాకే నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందాకు బీజం పడింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ 14 వరకు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం కొనసాగింది. ఈ మధ్య కాలంలో కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ కావడం సంచలనంగా మారింది.
ఇతర రాష్ట్రాల వారికీ సర్టిఫికెట్లు!
కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఇతర రాష్ట్రాల వారికీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి కూడా ఇక్కడి నుంచే బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ బర్త్ సర్టిఫికెట్లను ఎవరు జారీ చేశారు... ఇందుకు ఎవరైనా పంచాయతీ లాగిన్‌ను దుర్వినియోగం చేశారా... లేదా లాగిన్‌ను హ్యాక్ చేశారా..అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
17 వేల మంది జననం..
రిజిస్ట్రేషన్‌కు 42 వేల దరఖాస్తులు..
వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 2024లో జిల్లాలో 17 వేల శిశువులు జన్మించారు. అదే ఏడాది బర్త్ సర్టిఫికెట్ల కోసం 46 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2025లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసంపై విచారణ చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు..
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై కొమరేపల్లి గ్రామ కార్యదర్శి మహేష్ అగళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా...అన్న విషయం సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీపై
విచారణ వేగవంతం
గతంలో పని చేసిన
గ్రామ కార్యదర్శుల విచారణ
కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు!
తాము పంచాయతీ లాగిన్
ఉపయోగించలేదంటున్న కార్యదర్శులు
2024లో జిల్లాలో 17 వేల జననాలు..
బర్త్ సర్టిఫికెట్ల కోసం
42 వేల దరఖాస్తులు


