ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం
కనగానపల్లి: కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఒక వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలసి విషద్రావకం (గడ్డికి పిచికారీ చేసే మందు) తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ సంఘటన మండలంలోని తగరకుంట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రవి, గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో శుక్రవారం రవి గొడవపడగా భార్య గీత జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే తాను చనిపోతే తన బిడ్డలను ఎవరు చూస్తారని భయపడిన ఆమె... మొదట తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి విషద్రావకం తాగించి, తర్వాత తాను కూడా తాగింది. అపస్మాకర స్థితిలో ఉన్న వీరిని కుటుంబ సభ్యులు గుర్తించి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
8న పీజీ స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. పీజీ సెట్ రాయని అభ్యర్థులు, ఆసక్తి గల వారు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చు. అడ్మిషన్ పొందిన తక్షణమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఖాళీ సీట్ల వివరాలు ఇవే..
అడల్ట్ ఎడ్యుకేషన్ –24, అప్‌లైడ్ ఎకనామిక్స్ –30, ఎకనామిక్స్–26, ఇంగ్లిష్ 36, హిస్టరీ –24, పొలిటికల్ సైన్సెస్–17, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –29, రూరల్ డెవలప్‌మెంట్– 34, సోషియాలజీ –35, తెలుగు– 41, హిందీ–13, బయో కెమిస్ట్రీ–9, బయో టెక్నాలజీ– 6, బోటనీ–20, కెమిస్ట్రీ –29, ఆర్గానిక్ కెమిస్ట్రీ– 6, కంప్యూటర్ సైన్సెస్– 15, ఎలక్ట్రానిక్స్– 29, ఇన్‌స్ట్రుమెంటేషన్– 26, జియాగ్రఫీ–20, మేథమేటిక్స్– 24,అప్‌లైడ్ మేథమేటిక్స్– 26, మైక్రోబయాలజీ –2, ఫిజిక్స్– 42, పాలిమర్ సైన్సెస్–17,సెరికల్చర్–11, స్టాటిస్టిక్స్– 14, జువాలజీ– 15, ఎంకాం–42, ఎంకాం (అకౌంటింగ్)– 50, ఎంపీఈడీ– 34, ఎంఎల్‌ఐఎస్సీ– 30, ఎంఎస్‌డబ్ల్యూ–32.
దుగుమర్రి వీఆర్వో సస్పెండ్
శింగనమల(నార్పల): నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబారావుపై సస్పెన్షన్ వేటు పడింది. రంగాపురం గ్రామానికి చెందిన రైతు నాగార్జునతో మ్యుటేషన్ కోసం వీఆర్వో రూ.38 వేలు లంచం డిమాండ్ చేసిన విషయం విదితమే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి.. కలెక్టర్‌కు నివేదిక పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్వో వెంకోబారావును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం


