11న రామగిరి ఎంపీపీ ఎన్నిక
● ఐదోసారి నోటిఫికేషన్ ఇచ్చిన
ఎన్నికల సంఘం
రామగిరి: ఇప్పటికే నాలుగుమార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 11వ తేదీన ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది.
10 స్థానాల్లో 9 మంది
వైఎస్సార్ సీపీ అభ్యర్థులే..
రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్‌రిజర్వడ్ మహిళకు కేటాయించడంతో రామగిరి స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందగా...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది.
కుట్రలు.. అల్లర్లతో వాయిదాల పర్వం
ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికకు ఇప్పటికే నాలుగు సార్లు నోటిఫికేషన్ ఇవ్వగా...అధికార పార్టీ కుట్రలు, అల్లర్లతో వాయిదా పడుతూ వస్తోంది. తొలిసారి మార్చి 27న, రెండోసారి మే 18న, మూడోసారి జూలై 16న, నాల్గోసారి ఆగస్ట్ 13న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని పరిటాల కుటుంబం కుట్ర చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. అంతేకాకుండా మిగతా వారినీ భయపెట్టి ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ నెల 11న రామగిరి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది.


