కిరాతక మేనమామ అరెస్ట్
కదిరి టౌన్: మేనల్లుడిని కిరాతకంగా హతమార్చిన మామను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కదిరి రూరల్ పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ వెంకటశివనారాయణస్వామి వెల్లడించారు. గత నెల 26న తలుపుల మండలం గరికిపల్లికి చెందిన గంగాధర్, చంద్రకళ కుమారుడు చిన్నారి హర్షవర్ధన్(4) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మేనమామ తమ్ముతక ప్రసాద్ గరికిపల్లికి వెళ్లి హర్షవర్దన్‌ను తన బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన తమ్ముతక ప్రసాద్‌పై అనుమానాలు బలపడ్డాయి. దీంతో గాలింపు ముమ్మరం చేసి సోమవారం మూర్తిపల్లి పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతుండగా కదిరి రూరల్ పీఎస్ సీఐ నాగేంద్ర, సిబ్బంది అరెస్ట్ చేశారు. విచారణలో హర్షవర్దన్‌ను హతమార్చిన తీరును నిందితుడు వివరించాడు. దీంతో అతని వద్ద నుంచి మోటార్ సైకిల్, 4 గ్లౌజులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


