జిల్లాలో పేదల శ్రమను, ఆర్థిక వనరులను, జీవనాధారాలను దుండ
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా కేసుల్లో రికవరీలు అంతంత మాత్రంగానే ఉండడంతో దొంగలు మరింత రెచ్చిపోయారు. పల్లెల్లో రైతుల వ్యవసాయ పనిముట్లు, పశుసంపద, గొర్రెలు, మేకలు, పొట్టేళ్లతో పాటు చైన్‌స్నాచింగ్‌లు, చిల్లర దొంగతనాలకు తెరలేపి పేదల జీవనాధారాలను కొల్లగొడుతున్నారు. దొంగతనం జరిగిన కొద్ది రోజులు హడావిడి చేసే పోలీసులు తర్వాత దర్యాప్తును సాగదీస్తున్నారు. ఇదే అదనుగా మరింత రెచ్చిపోయిన దొంగలు... ఏకంగా బ్యాంక్‌లకే కన్నం వేసే స్థాయికి ఎదిగారు. ఇటీవల హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామిక వాడలోని ఎస్‌బీఐలో దోపిడీనే ఇందుకు నిదర్శనం. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులు డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతూ తమ జీవనాధారాలను లూటీ చేస్తున్నారని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని...
● జిల్లాలో ఇటీవల వాహనాల్లో భద్రపరిచిన డబ్బు, బంగారాన్ని దుండగులు అపహరించారు. చైన్‌స్నాచింగ్‌లు, ఇంట్లో భద్రపరిచిన ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు, పాఠశాలల్లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు, కేబుల్, డ్రిప్పు పరికరాలు, పైపులు, పాడి ఆవులు, ఎద్దులు, పొట్టేళ్లు, గొర్రెలు... ఇలా చేతికి చిక్కిన దేనినీ దొంగలు వదల్లేదు.
●బత్తలపల్లి మండలం గుమ్మలకుంటకు చెందిన ఈశ్వరరెడ్డికి చెందిన రూ.2 లక్షల విలువ చేసే పాడి ఆవులను ఆరు నెలల క్రితం దొంగలు ఓ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రైతు స్వయంగా రంగంలో దిగి రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని పశువుల సంతలను జల్లెడ పట్టాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో చివరకు కర్నూలులోని మార్కెట్‌కు వెళ్లి చూడగా అప్పటికే అమ్మకానికి పెట్టిన తన ఆవులు కనిపించాయి. దీంతో అక్కడి పోలీసుల సహకారంతో ఆవులను విడిపించుకుని వచ్చాడు.
● పుట్టపర్తిలో వ్యవసాయాధికారిగా పని చేస్తున్న వెంకటబ్రహ్మం ఇంట్లో ఏడాది క్రితం సుమారు 30 తులాల బంగారు నగలను దుండగులు అపహరించారు. ప్రస్తుతం వాటి విలువ రూ.30 లక్షలకు పైగా ఉంటుంది. ఏడాది గడిచినా వీసమెత్తు బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేయలేకపోయారని వెంకటబ్రహ్మం వాపోతున్నాడు.
● రెండు నెలల క్రితం పుట్టపర్తి మండలం వెంకలగారిపల్లి, జగరాజుపల్లి, గౌనికుంటపల్లి గ్రామాల్లో సుమారు 20 మంది రైతులకు చెందిన స్టార్లర్లు, కేబుల్ అపహరణకు గురైంది.
● గత నెలలో నల్లమాడ మండలం చౌటకుంటపల్లిలో సీవీ రంగారెడ్డి పెంచుకుంటున్న 20 పొట్టేళ్ల దొంగలు ఎత్తుకెళ్లారు.
● రెండు రోజుల క్రితం తలుపుల మండలం కుమ్మరపేటలో 19 గొర్రెలు, పొట్టేళ్లను అపహరించారు.
● గాండ్లపెంటలో 20 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో రైతు సూర్యనారాయణరెడ్డికి చెందిన 60 నాటుకోళ్లు ఎత్తుకెళ్లారు.
వెర్రితలలు వేస్తున్న దొంగతనాలు
పశువులు, జీవాలు, మోటార్లు, స్టార్టర్లు అపహరణ
కేసుల దర్యాప్తులో కనిపించని పురోగతి
జిల్లాలో పేదల శ్రమను, ఆర్థిక వనరులను, జీవనాధారాలను దుండ


