మృత్యువులోనూ వీడని బంధం
మడకశిర రూరల్: వారి బంధాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఏడడుగుల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు చావులోనూ ఒక్కటయ్యారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్‌ను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారు అక్కడికక్కడే మరణించారు. వివరాలు... మడకశిర మండలం గుడ్డంపల్లికి చెందిన జ్యోతి, కృష్ణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వగ్రామంలో వైఎస్సార్‌సీపీ కీలక నేతగా గుర్తింపు పొందిన కృష్ణారెడ్డి స్థానిక పంచాయతీ వార్డు సభ్యుడిగా గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. బెంగళూరులోని డాన్‌బాస్కో పాఠశాలలో జ్యోతి పనిచేస్తుంది. ఈ క్రమంలో కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి కుమారుడు మధుసూదన్‌రెడ్డితో కలసి కారులో వచ్చారు. ఆదివారం స్వగ్రామంలో నూతన ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. హాసన్‌లో ద్వితీయ పీయూసీ (ఇంటర్) చదువుతున్న మధుసూదన్‌రెడ్డికి పరీక్ష ఉండడంతో సోమవారం తెల్లవారుజామున కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జడగొండనహళ్లి వద్దకు చేరుకోగానే పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. జ్యోతి (35), కృష్ణారెడ్డి (41) అక్కడికక్కడే మృతి చెందారు. మధుసూదన్‌రెడ్డితో పాటు బంధువు, జక్కేపల్లికి చెందిన చిదంబరరెడ్డి స్వల్స గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై మధుగరి పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలియగానే గుడ్డంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తరలించారు. విషయం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వైసీ గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర వక్కలిగ విభాగం అధ్యక్షుడు రంగేగౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, తాలూకా బూత్ కమిటీ మేనేజర్ మల్లికార్జున, వివిధ విభాగాల కమిటీ సభ్యులు దేవరాజు, సిద్దగంగప్ప, నాగభూషణరెడ్డి, నరేష్‌రెడ్డి, హరిప్రసాద్, నగేష్, నాయకులు, వార్డు సభ్యులు... కృష్ణారెడ్డి దంపతుల మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కర్ణాటకలో చోటు చేసుకున్న ప్రమాదంలో దంపతుల మృతి
బలిగొన్న పొగమంచు ప్రాణాలతో బయటపడిన కుమారుడు,
మరో వ్యక్తి
జ్యోతి, కృష్ణారెడ్డి (ఫైల్)
మృత్యువులోనూ వీడని బంధం


