సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి
అనంతపురం: సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ (54) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. రాజకీయ, అధికార, అనధికారులతో సుదీర్ఘ పరిచయాలు ఉన్న కాలవ రమణ... జిల్లా కరువు, సాగునీటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మృతిపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు నర్సింగ్ హోం వద్దకెలిల రమణ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు మృతదేహాన్ని స్వస్థలం హిందూపురానికి కుటుంబసభ్యులు తరలించారు. కాగా, వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత గల కాలవ రమణ మృతి బాధాకరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందరితో కలివిడిగా, ఆప్యాయంగా ఉంటూ అభిమానంగా మాట్లాడే కాలవ రమణ పత్రికా లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. పాత్రికేయ వృత్తిలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి బాధాకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. హిందూపురంలోని కాలవ రమణ నివాసం వద్ద మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పరిష్కార వేదికకు 98 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 98 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని, చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీ 93 శాతం పూర్తి
పుట్టపర్తి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ పక్రియ తొలిరోజు 93 శాతం మేర పూర్తయిందని డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పింఛన్ తీసుకోని వారికి మంగళవారం అందజేస్తారన్నారు. పింఛన్ల పంపిణీని కొత్తచెరువు మండలం బైరాపురంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు.
సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి


