ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం
పుట్టపర్తి అర్బన్: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత హెచ్‌ఐవీపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ హెచ్‌ఐవీ కలిగిన వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదని, మనలో ఒకరిగా చూడాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమస్థాయి అవార్డు లభించిందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు మొత్తం 7 అవార్డులు వచ్చాయన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ అనుపమజేమ్స్ మాట్లాడుతూ ఐదేళ్లుగా ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి స్వచ్ఛంద సంస్థలు పని చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, కమిషనర్ క్రాంతికుమార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధుసూదన్, జిల్లా సూపర్‌వైజర్ రమణ, ఇమ్యునైజేషన్ అధికారి సురేష్‌బాబు, డీపీఎంఓ నాగేంద్రనాయక్, నోడలాఫీసర్ సునీల్‌కుమార్, డెమో రామలక్ష్మి, మంగళకర, సంస్కృతి విద్యాసంస్థల విద్యార్థులు, శ్రీవిజ్ఞాన్, వెంకటేశ్వర జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, అనంత నెట్ వర్క్, జనజాగృతి, శక్తి మైత్రి, ఆర్డీటీ, లింక్ వర్కర్ వీఎంఎం సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలు
వైద్య ఆరోగ్యశాఖతో కలిసి ఎయిడ్స్ నివారణ, నియంత్రణకు పని చేసిన పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. హెచ్‌ఐవీ బాధితులను మనలో ఒకరిగా గౌరవిద్దామన్నారు. వేరు చేసి చూడరాదన్నారు. దాతల సహకారంతో సేకరించిన పౌష్టికాహారాన్ని 30మంది చిన్నారులకు అందజేశారు. హెచ్‌ఐవీ కలిగిన పిల్లలు, పెద్దలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.


